19-12-2025 02:07:16 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 18 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అధికారిక క్రిస్మస్ విందు కార్యక్రమ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని రాష్ర్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ వేడుకకు సంబంధించి గురువారం ఆయన స్టేడియంలో వివిధ శాఖ ల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్న విందు కావడంతో ఏర్పాట్లు ఘనంగా ఉండాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. డయాస్ నిర్మా ణం, బారికేడ్లు, ర్యాంపులు, గ్యాలరీల ఏర్పాటు పక్కాగా ఉండాలని, వచ్చే అతిథులకు ఎలాం టి అసౌకర్యం కలగకూడదని స్పష్టం చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, సౌండ్ ప్రూఫ్ జనరేటర్లు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఈ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతారని మంత్రి తెలిపారు. అలాగే దాదాపు 10 వేల మంది క్రైస్తవులు ఈ వేడుకలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. పోలీసుల పాత్ర కీలకమని, అతిథులను వారికి కేటాయించిన గ్యాలరీల్లోకి పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, వాహనాలను ఎప్పటికప్పుడు పార్కింగ్ స్థలాలకు మళ్లించాలని సూచించారు. భోజన ఏర్పాట్ల విషయంలో రాజీ పడకూడదని, వంటలు చేసే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. స్టేడియంలో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు జరగాలని చెప్పారు. డయాస్‌ను పూలతో సుందరంగా అలంకరించాలని, ఎల్‌ఈడి స్క్రీన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మీడియా గ్యాలరీ ఏర్పాటు చేయాలని సూచించారు.
విధుల్లో ఉండే సిబ్బందికి పాసులు జారీ చేయాలన్నారు.అనంతరం మంత్రి.. మెడికల్, జీహెఎంసీ, హెఎండీఏ, ఆర్ అండ్ బీ, విద్యుత్, ఆర్టీసీ, ఉద్యానవన శాఖల అధికారులతో కలిసి స్టేడియంలో జరుగుతున్న పను లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. సమావేశంలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీ ఉల్లా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ క్రాంతి వెస్లీ, డైరెక్టర్ సీఈడీఎం శుకూర్, వాటర్ వర్క్స్ ఈడీ మయాంక్ మిథల్ తదితరులు పాల్గొన్నారు.