19-12-2025 02:10:25 AM
టెలిగ్రామ్‌లో హెచ్‌డీ హబ్
ఒక్కో లింకుకు 300 డాలర్ల వసూలు
హిట్ -3, కిష్కిందపురి చిత్రాలు ఇలాగే లీక్
విచారణలో వెల్లడించిన ఐబొమ్మ రవి
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 18 (విజయక్రాంతి): ఇన్నాళ్లూ సినిమా పైరసీ అం టే.. ఎవరో థియేటర్‌లో కూర్చుని ఫోన్లోనో, రహస్య కెమెరాతోనో రికార్డ్ చేసి ఇంటర్నెట్‌లో పెడతారని అంతా భావించారు. కానీ, ఐబొ మ్మ వెబ్ సైట్ సూత్రధారి ఇమ్మడి రవి ఎంచుకున్న మార్గం చూసి టాలీవుడ్ వర్గాలే కాదు, సైబర్ క్రైమ్ పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు. ఏకంగా సినిమా ప్రదర్శన వ్యవస్థలైన క్యూబ్ సర్వర్లనే హ్యాక్ చేయడం, శాటిలైట్ లింక్‌లను హైజాక్ చేసి సినిమాను దొంగిలించడం వంటి సంచలన విషయాలు గురువా రం పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చా యి.
గత ఐదు రోజుల విచారణలో నాకేమీ గుర్తులేదు.. పాస్ వర్డ్స్ మర్చిపోయాను అం టూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన రవి.. గురువారం నుంచి ప్రారంభమైన తాజా కస్టడీలో నోరు విప్పక తప్పలేదు. మూడు వేర్వేరు కేసుల్లో నాంపల్లి కోర్టు రవికి మొత్తం 12 రోజుల ఒక్కో కేసుకు 4 రోజులు పోలీస్ కస్టడీ విధించింది.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. సాంకేతిక ఆధారాలను ముందుంచి ప్రశ్నించడంతో అసలు నిజాలు కక్కినట్లు సమాచారం. రవి కేవలం ఒక వెబ్ సైట్ నిర్వాహకుడు మాత్రమే కాదని, అతనొక నిష్ణాతుడైన హ్యాకర్ అని పోలీసులు గుర్తించారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ల నుంచి థియేటర్లకు డిజిటల్ కంటెం ట్ సరఫరా చేసే క్యూబ్ నెట్‌వర్క్‌ను తాను బ్రేక్ చేసినట్లు రవి అంగీకరించాడు.
సాధారణంగా సినిమాలను శాటిలైట్ లింక్‌ల ద్వారా ఎన్‌క్రిప్ట్ చేసి థియేటర్లకు పంపిస్తారు. రవి ఈ శాటిలైట్ లింక్ ఫ్రీక్వెన్సీని హ్యాక్ చేసి, డీకోడింగ్ సాఫ్ట్‌వేర్ల సాయంతో కంటెంట్‌ను ఇంటర్సెప్ట్ చేసేవాడు. దీనివల్ల థియేటర్ స్క్రీన్ మీద కెమెరాతో తీసినట్లు కాకుండా.. స్టూడియో నుంచి వచ్చిన క్వాలిటీతో ఒరిజినల్ హెచ్‌డీ ప్రింట్ అతడి చేతికి వచ్చేది. పైరసీ చేసిన కంటెంట్‌ను విక్రయించేందుకు రవి టెలిగ్రామ్‌ను అడ్డాగా మార్చుకున్నాడు.
హెచ్‌డీ హబ్ పేరుతో ఒక రహస్య ప్రైవేట్ ఛానల్‌ను ఏర్పాటు చేశాడు. ఇందులో కేవలం విశ్వసనీయమైన బయ్యర్లు మాత్రమే ఉంటారు. తాను హ్యాక్ చేసిన సినిమా హెచ్‌డీ లింక్‌ను ఇందులో పోస్ట్ చేయడానికి ముందే రేటు ఫిక్స్ చేసేవాడు. ఒక్కో సినిమా లింక్ కోసం 100 డాలర్ల నుంచి 300 డాలర్ల వరకు, సుమారు రూ.8 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేసేవాడు. ఈ లావాదేవీలన్నీ పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు క్రిప్టో కరెన్సీ లేదా విదేశీ పేమెంట్ గేట్‌వేల ద్వారా జరిపినట్లు అనుమానిస్తున్నారు.
విడుదలైన రోజే ఇంటర్నెట్‌లో..
ఇటీవల విడుదలై సంచలన విజయా లు సాధించిన హిట్3, కిష్కిందపురి సినిమాల హెచ్‌డీ ప్రింట్లు విడుదలైన రోజే ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం వెనుక తన హస్తమే ఉందని రవి అంగీకరించినట్లు తెలిసింది. ఈ సినిమాలను తాను శాటిలైట్ లిం క్ హ్యాకింగ్ ద్వారానే దొంగిలించి, మార్కెట్‌లో విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. ఈ పైరసీ కారణంగా నిర్మాతలు కోట్లాది రూపాయలు నష్టపోయారు.
ప్రస్తుతం రవి పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. రాబోయే 11 రోజుల విచారణలో ఇంకెన్ని విస్మయక ర విషయాలు బయటపడతాయోనని ఆసక్తిగా మారింది. రవికి సహకరించిన టెక్నికల్ టీమ్ ఎవరైనా ఉన్నారా? క్యూబ్ సంస్థలో ఎవరైనా ఇన్‌సైడర్లు సహకరించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.