ఓటుకు దూరంగా నగర మహిళలు

01-05-2024 01:40:44 AM

ఓటింగ్‌లో పాల్గొనని మహిళా ఓటర్లు

అవగాహన కల్పించినా ఫలితం శూన్యం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) :  నగరంలో ఓటు చైతన్యం మందగిస్తోంది. ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ శాతం 50శాతానికి కూడా చేరుకోవడం లేదు. ముఖ్యంగా మహిళల ఓట్లు పోలింగ్ కేంద్రాల వరకు చేరుకోవడం లేదు. అయితే గ్రామాల్లో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కవ శాతం ఓట్లు వేస్తుండగా, పట్టణాల్లో మాత్రం ఓట్ల పండుగనాడు 55శాతం మహిళలు గడప దాటడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మహిళల ఓట్లు 50శాతం కూడా పోలవడం కష్టంగా మారింది. వాస్తవానికి విద్యాంవంతులు, మేధావులు, ఉద్యోగులు, వ్యాపారులు అత్యధిక సంఖ్యలో నివాసం ఉండే నగరాల్లో మహిళలు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. నగరాల్లో ఓటు చైతన్య కార్యక్రమాలు ఎన్ని రకాలుగా చేసిన ఫలితం లేదని అధికారులు పేర్కొన్నారు. 

ఓటర్లు ఎక్కువ పోలింగ్ తక్కువ...

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం జనాభాలో సుమారు 45శాతం జనాభా హైదరాబాద్, హైదరాబాద్‌తో పాటు నగర శివారులోని మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనే ఉంటుంది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం మహిళా ఓటర్లలో 42.07శాతం, సికింద్రాబాద్ పరిధిలో 45.18శాతం, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 48.83శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 52.64శాతం మంది మహిళలు ఓటు వేశారు. వయోజనులైన ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ తేదీ నాడు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా సెలవు ప్రకటిస్తారు. కానీ పెద్దగా ప్రయోజనం లేదని ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు పేర్కొన్నారు. 

ఫలించని చైతన్య కార్యక్రమాలు..

ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటు వేయాలని ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ఇదిలా ఉండగా పలువురు ఓటర్లు చనిపోవడం, డబుల్ ఓట్లు ఉండడం, నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవడం, విదేశాలకు తరలిపోవడం కూడా పోలింగ్ శాతం పెరగకపోవడానికి ఓ కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఎన్నికైన వ్యక్తి తమ కోసం పని చేయరు కదా? ఎలాగూ పలానా వ్యక్తే గెలుస్తాడు, ఆయన మాకెలాగూ ఉపయోగపడరు కదా? ఓటు వేసినా వేయకపోయినా తమ పనులు తామే చేసుకోవాలి, కాబట్టి ఓటేందుకు వేయాలని పలువురు వితండవాదం చేసేవారూ లేకపోలేదు. కనీసం ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో అధికారులు నగరాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు తప్పకుండా ఓటేయాలని మహిళా పొదుపు సంఘాలతో సమావేశాలు నిర్వహించి ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అయితే నగర మహిళలు ఈసారైనా ఓటేస్తారా? లేదా అనేది మే 13న జరుగబోయే పోలింగ్ రోజు తేలనుంది. కాగా మండుతున్న ఎండలు కూడా ఈసారి పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.