ఎయిర్ షో.. అదరహో !
* నింగిలోకి దూసుకెళ్లిన సూర్యకిరణ్ విమానాలు
* ట్యాంక్‌బండ్ నుంచి వీక్షించిన సీఎం, మంత్రులు
* భారీగా తరలి వచ్చిన నగర వాసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (విజయక్రాంతి): నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. భారత వాయుసేన సూర్యకిరణ్ విమానాలతో నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. సాయంత్రం 4.15 గంటలకు ప్రారంభమైన 10 విమానాల విన్యాసాలు అరగంట పాటు సాగాయి. కొన్ని విమానాలు 360 డిగ్రీల్లో పల్టీలు కొట్టడంతో యువత కేరింతలు కొట్టారు. సెలవురోజు కావడంతో నగరవాసులు పిల్లాపాపలతో హుస్సేన్ సాగర్‌కు తరలి వచ్చారు.
తమ సెల్‌ఫోన్లలో ఎయిర్‌షోకు సంబంధించిన ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకుని సంబురపడ్డారు. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దసరథి నేతృత్వంలో ఎయిర్ షో జరిగింది. షోను ట్యాంక్‌బండ్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ డాక్టర్ జితేందర్, హైదరాబాద్ సీపీ సి.వి ఆనంద్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వీక్షించారు.






