02-05-2025 10:34:52 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సివిల్ సప్లై గోదాము లో బియ్యం తూకం వేసే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ సక్రమంగా పనిచేయడం లేదని, ఫలితంగా తమకు బియ్యం తక్కువగా వస్తున్నాయని, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు డీలర్లు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి విజయకుమార్ శుక్రవారం కేసముద్రం సివిల్ సప్లై గోదాం వేయింగ్ మిషన్ ను తనిఖీ చేశారు. వేయింగ్ యంత్రంపై 20 కిలోల బరువున్న ఐదు తూకం రాళ్ళను వేసి, ఐదు టన్నుల బియ్యాన్ని తూకం వేసి తనిఖీ చేసినట్లు చెప్పారు. తూకంలో ఎలాంటి తేడా లేదని, తాము రెండు నెలల క్రితం తనిఖీ చేసి వేసిన సీలు యధావిధి గానే ఉందని ఆయన తెలిపారు. నిర్దేశిత స్థలంలో యంత్రాన్ని ఉంచకపోవడం వల్ల సాంకేతిక సమస్య వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. వేయింగ్ యంత్రాన్ని శుభ్రం చేసి కొందరు రేషన్ డీలర్ల సమక్షంలో బియ్యం తూకం వేసి చూపినట్లు డి.ఎల్.ఎమ్.ఓ తెలిపారు.