calender_icon.png 3 May, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ ఫైరింగ్ రేంజ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మల్టిజోన్ రేంజ్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి

02-05-2025 10:31:22 PM

చేగుంట/నార్సింగి,(విజయక్రాంతి): మెదక్ జిల్లా నార్సింగి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ ఫైరింగ్ రేంజ్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం మల్టీ జోన్ ఐజి చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫైరింగ్ రేంజ్ సభా స్థలానికి చేరుకున్న ఐజి కి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పుష్ప గుచ్చమిచ్చి ఘన స్వాగతం పలికారు, పరేడ్ నిర్వహించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఐజి గౌరవ వందనాన్ని స్వీకరించి.అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, శిక్షణ ప్రాంతంలో బుల్లెట్లు ఫైర్ చేసి ఫైరింగ్ రేంజ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఐజి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... మెదక్ పోలీస్ సిబ్బంది ఫైరింగ్ చేయుటకు సిద్దిపేట , సంగారెడ్డి జిల్లా ఫైరింగ్ రేంజ్ కు వెళ్లాల్సి వచ్చేదని,మెదక్ పోలీసులకు ఉపయోగకరంగా ఉండేందుకు నార్సింగి ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు  భూమి కేటాయించినందుకు కలెక్టర్ రాహుల్ రాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఫైరింగ్ చేస్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా పాటించాలని ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలని, ఫైరింగ్ శిక్షణ సమయంలో ఎవరిని కూడా ఈ ప్రాంతానికి రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని ఎవరికీ ఎలాంటి ప్రాణ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. నార్సింగి ఫైరింగ్ రేంజ్ స్థలం రాళ్ళు రప్పలతో ఉన్న దానిని శ్రమించి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది నందుకు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ రంగ నాయక్, తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, స్థానిక ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్ లను అభినందించారు.

పోలీస్ వ్యవస్థ ఉన్నంత వరకు ఈ ఫైరింగ్ రేంజ్ ఉపయోగంలో ఉంటుందని,ఉద్యోగ విరమణ సమయం దగ్గర పడుతున్నా ఎనలేని పట్టుదల తో తన ఉద్యోగ కాలంలో పోలీస్ వ్యవస్థ కు చిరకాలం గుర్తింపు ఉండే విధంగా ఫైరింగ్ రేంజ్ కోసం శ్రమించిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ని ప్రత్యేకంగా అభినందించారు.ఫైరింగ్ రేంజ్ లో రేంజ్ డిసిప్లిన్ పాటించాలని ప్రజా సేవకు పోలీస్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు తమ ఆయుధ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవలని సూచించారు.స్థానిక తహశీల్దార్ షేక్ కరీం మల్టీ జోన్ చంద్రశేఖర్ రెడ్డి కి పుష్పగుచ్చము అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్,8 సర్కిళ్ల సీఐలు,21 ఎస్ఐ,స్థానిక తహశీల్దార్ షేక్ కరీం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సర్వేయర్ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.