సిరియాలో మళ్లీ తిరుగుబాటు
రెండో పెద్ద నగరం అలెప్పో స్వాధీనం
మళ్లీ సంక్షోభం దిశగా సిరియా
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: సిరియా ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోలోకి తిరుగుబాటుదారులు ప్రవేశించారు. కాగా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ప్రభుత్వ దళాలు వెనక్కి మళ్లినట్లు తెలుస్తోంది. 2013లో అలెప్పోను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. 2016లో తిరిగి ప్రభుత్వ దళాలు చేజిక్కించుకున్నాయి. అప్పటి నుంచి ఈ నగరంపై తిరుగుబాటుదారులు ఎలాంటి దాడులు చేయలేదు.
అనూహ్యంగా బుధవారం నుంచి తిరుగుబాటుదారుల దాడులు ప్రారంభమయ్యాయి. శుక్రవారమే అలెప్పోపై ప్రభుత్వ దళాలు పట్టుకోల్పోయినట్లు తెలుస్తోంది. శనివారం అలెప్పోలోని చాలా ప్రాంతాల్లో తిరుగుబాటుదారుల వెహికల్స్ కనిపించాయి.
మళ్లీ మొదటికి..
సిరియా అధ్యక్షుడు బషర్ అల్x అసద్‌కు వ్యతిరేకంగా 2011 ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారు. ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇందులో దాదాపు 6 లక్షలకు పైగా పౌరులు చనిపోయారు. దేశంలోని వివిధ నగరాలు ధ్వంసమయ్యాయి. రష్యా, ఇరాన్ దేశాల అండతో అసద్ దేశంలోని మెజార్టీ ప్రాంతాలపై పట్టు సాధించాడు. కొన్నేండ్లుగా అంతర్యుద్ధ తీవ్రత తగ్గుముఖం పట్టింది. తాజాగా బుధవారం నుంచి తిరుగుబాటుదారుల అనూహ్య దాడులతో సిరియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.






