12 July, 2026 | 9:40 AM

100శాతం సుంకాలు విధిస్తాం

02-12-2024 02:55 AM

బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక

డాలర్‌కు పోటీగా ఉమ్మడి కరెన్సీని రూపొందించొద్దని సూచన

వాషింగ్టన్, డిసెంబర్ 1: అమెరికా డాలర్‌తో సమానంగా బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే వాటిపై 100శాతం సుంకం విధిస్తామని సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్‌ను పక్కన పెట్టాలని ప్రయత్నిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శక్తివంతమైన అమెరికా డాలర్‌కు బదులు మరో కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పారు.

బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే ఆయా దేశాల దిగుమతులపై 100శాతం సుంకం విధించనున్నట్టు తెలిపారు. దీంతోపాటు బ్రిక్స్ దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని కూడా వదులుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, అక్టోబర్‌లో రష్యా వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి కరెన్సీని రూపొందించడంపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిర్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆయా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. 

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్

అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా ట్రంప్ నియమించారు. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని గెలిపించేందుకు కశ్యప్ నిరంతరం శ్రమిస్తారని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. ఎఫ్‌బీఐకి పూర్వవైభవం తీసుకొస్తాడని విశ్వసిస్తున్నట్టు వెల్లడించారు.

కశ్యప్ కుటుంబ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా ఆయన కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. న్యూయార్క్‌లోని గార్డెన్ నగరంలో కశ్యప్ జన్మించారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. గతంలో ఈయన ఎఫ్‌బీఐ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు.