జల విద్యుత్‌పై ఎల్ నినో ప్రభావం
- ‘థర్మల్’ కేంద్రాల్లో గరిష్ఠ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలి
- నాణ్యమైన బొగ్గు సరఫరాయే లక్ష్యం
- సింగరేణి విస్తరణను అడ్డుకున్న బీఆర్‌ఎస్
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ప్రజాభవన్‌లో ఇంధనశాఖపై సమీక్షా సమావేశం
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): జల విద్యుత్ ఉత్పత్తిపై ఎల్ నినో ప్రభావం పడనున్నదని, అందువల్ల జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలని డిప్యూటీ భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. థర్మల్ పవర్ స్టేషన్లకు తగినంత, నిరంతరాయమైన నాణ్యమైన బొగ్గు లభ్యతను నిర్ధారించడమే లక్ష్యంగా సింగరేణి గనుల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లనున్నట్లు భట్టి ప్రకటించారు.
హైదరాబాద్ ప్రజాభవన్‌లో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి ఇంధనశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జెన్‌కోలో పెరిగిన స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, దీర్ఘకాలిక సమయంలో బొగ్గు సరఫరాలో ఏర్పడే సవాళ్లు, భవిష్యత్ కార్యచరణ ప్రణాళిపై సుదీర్ఘంగా చర్చించారు. జెన్ కో పరిధిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో ఉత్పాదకత పెంచేలా తప్పనిసరి చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు భట్టి సూచించారు. వైటీపీఎస్‌ను 2016--17లో గత ప్రభుత్వం ప్రారంభించింనా పనులు నత్తనడకన సాగాయన్నారు. వైటీపీఎస్‌కు సీంగరేణి నుంచి ఏటా 14 వేల టన్నుల జీ9 గ్రేడ్ రకం బొగ్గును సరఫరా చేసేందుకు అన్ని రకాల అనుమతులు ఉన్నా..
గత ప్రభుత్వం నిర్మాణ పనుల్లో జాప్యం చేసిందని, ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం ఎక్కడా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించకపోవడంతో నేడు అనేక సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. అంతేకాక సింగరేణితో 2022లో బొగ్గు సరఫరాకు ఒప్పందం కుదిరినా ఎంతమేర బొగ్గు పరిమాణం, బొగ్గు నాణ్యత, సరఫరా వంటి వాటిని ప్రణాళిక బద్ధంగా నిర్ణయించకపోవడం కూడా నేటి సమస్యలకు కారణంగా మారిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే
వైటీపీఎస్ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు సాధించి పనులను పరుగులు పెట్టించిందన్నారు. పనులు ప్రారంభించిన ఏడాదికే అంటే 2025లోనే మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించామని, 2025--26, 2026-- 27 సంవత్సరాల మధ్య మరో మూడు యూనిట్లు ( 800 మెగావాట్లు) ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజాప్రభుత్వం తీసుకున్నచర్యల మూలంగా 2026- 27 నాటికి జెన్ కో మొత్తం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగి 7,180 మెగావాట్లకు చేరిందన్నారు.
సింగరేణి గనుల్లో క్షేత్రస్థాయి పరిశీలన
బొగ్గు సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు 2025--26లో విజయవంతంగా 27,908 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయన్నారు. రాష్ట్ర మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 31 శాతం అవసరాలను జెన్ కో సమర్థవంతంగా తీర్చిందన్నారు. ఇది గతంలో అంటే 2024-25లో కేవలం 25.14శాతంగా ఉండేదన్నారు. బొగ్గు సరఫరాను మెరుగుపరిచి.. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 40 శాతం మేర జెన కో తీర్చగలిగేస్థాయికి చేరుస్తామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2026లో వైటీపీఎస్ 5వ యూనిట్ ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని థర్మల్ పవర్ స్టేషన్లకు తగినంత, నిరంతరాయమైన నాణ్యమైన బొగ్గు లభ్యతను నిర్ధారించడమే లక్ష్యంగా సింగరేణి గనుల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లనున్నట్లు భట్టి తెలిపారు. ఈ పర్యటన లో భాగంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా, నాణ్యతపై ఎదురవుతున్న సమస్యలపై క్షేత్రస్థాయిలోనే ప్రత్యక్ష సమీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జెన్ కో సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






