8 August, 2026 | 1:15 AM

బంగ్లాదేశ్‌లో ఘర్షణలు

08-08-2026 12:00 AM

బంగ్లాదేశ్‌లో మళ్లీ రాజకీయ వేడి రాజుకున్నది. అధికారాన్ని కోల్పోయి, భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాది చివరికి స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఆసక్తి కనబరచడమే అందుకు కారణం. హసీనా ఇటీవల ఆన్‌లైన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించగా, ఆ కార్యక్రమంలో పాల్గొన్న క్రికెటర్ షకీబుల్ హసన్ ఇంటితోపాటు మరో చోట బాంబు దాడి జరగడం ప్రకంపనలు సృష్టించింది.

ఈ ఘటన బంగ్లాదేశ్‌లో రాజకీయ విభేదాలు ఇంకా చల్లారలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు కల్పించిన శాశ్వత రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ 2024లో యువత చేపట్టిన నిరసనలు క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారిన విషయం విదితమే. నిరసనల సమయంలో జరిగిన హింస, ప్రాణనష్టంతో పరిస్థితులు అదుపుతప్పి పదిహేనేళ్లపాటు అప్రతిహతంగా కొనసాగిన షేక్ హసీనా సర్కార్ కుప్పకూలిపోయింది.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తారీఖ్ రెహ్మాన్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే, షేక్ హసీనా స్వదేశానికి తిరిగివెళ్లాలని ఆసక్తి చూపుతుండగా, తారిఖ్ ప్రభుత్వం మాత్రం ఆమె రాకను సానుకూలంగా చూడడం లేదు. హసీనాను తిరిగి తమ దేశానికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఉన్న తారీఖ్ ప్రభుత్వం ఆమెను రాజకీయ నేతగా కాకుండా, వివిధ కేసుల్లో నిందితురాలిగా విచారించాలనే వైఖరితో ఉన్నది. ఇప్పటికే అధికార దుర్వినియోగం, మానవ హక్కుల ఉల్లంఘనలు, హత్య వంటి అనేక కేసుల్లో న్యాయ విచారణ కొనసాగుతున్నది. అందుకే హసీనా న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందేనని పట్టుబడుతున్నది.

మరోవైపు విద్యార్థి ఉద్యమాల ముసుగులో తన ప్రభుత్వాన్ని కూలదోశారని ఆరోపిస్తున్న హసీనా, తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు తన మద్దతుదారులు శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని ఆమె పిలుపునివ్వడం గమనార్హం. ఈ పరస్పర ఆరోపణల్లో ఉన్న సత్యాన్ని న్యాయవ్యవస్థే తేల్చాల్సి ఉంది. కాగా, ఈ పరిస్థితుల్లో హసీనా తిరిగి బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే అది ఒక మాజీ ప్రధానమంత్రి రాకగానే కాకుండా మరో పెద్ద రాజకీయ ఘర్షణకు దారితీసే అవకాశముంది. ఈ తరుణంలో బంగ్లాదేశ్‌లో శాంతి, స్థిరత్వం నెలకొనాలంటే ముందుగా రాజకీయ విభేదాలు సమసిపోవాలని చెప్పక తప్పదు. అదే సమయంలో ప్రతీకార రాజకీయాలకు ముగింపు పలకడం, కేసుల విచారణ పారదర్శకంగా సాగాల్సిన అవసరం ఉంది.