ఎచ్చమ్మ కథల యశోద
ఒక జాతి సంస్కృతిలో ఆ జాతి జీవన విధానం ప్రతిఫలిస్తుంది. ఈ సంస్కృతీ సర్వస్వం ఆ జాతి భాషలో నిక్షిప్తమై జీవిస్తుంది. ఒక భాషలో ఒక నానుడి కాని, సామెత కాని, జాతీయం కాని అలవోకగా పుట్టదు. ఆయా జాతీయులు తలలు పండిన వారి అనుభవరాశిని కాచి, వడబోసి నిగ్గుదేల్చిన సారమే ఈ నుడికారపు ఇంపు సొంపులు. అందుకే అవి భాషకు జీవనాడి, ప్రాణధాతువుల వంటివి అంటారు యశోదారెడ్డి. ఆచార్య పాకాల యశోదారెడ్డి 1929 ఆగస్టు 8న మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామంలో జన్మించారు. యశోద తల్లిదండ్రులు సరస్వతమ్మ, కాశిరెడ్డి. చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన ఆమె బంధువుల వద్ద పెరిగారు.
చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఆమెను హైదరాబాద్ నారాయణగూడలోని మాడపాటి బాలికల పాఠశాలలో చేర్చారు. హైదరాబాద్‌లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసిన యశోద, విజయవాడలో ఆంధ్ర మెట్రిక్ పరీక్షను ప్రత్యేక అనుమతితో రాశారు. గుంటూరు ఎ.సి. కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలోని అన్నారం గ్రామవాసి ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమలరెడ్డితో ఆమె పెళ్లి జరిగింది. రాతకు గీత తోడైంది. భర్త ప్రోత్సాహంతో ఆమె ఉన్నత విద్య పూర్తి చేశారు.
కోఠి వుమెన్స్ కాలేజీలో తెలుగు అధ్యాపకురాలిగా తన ప్రస్థానం ప్రారంభించి, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పదవీవిరమణ చేశారు. యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ మెంబర్‌గా, కేంద్ర సాహిత్య అకాడమీ మెంబర్‌గా, అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. అయితే, తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో కునారిల్లిన సమాజం నుంచి మొదలుకొని, అంటే 1930వ దశకం నుంచి 2007 దశకం వరకూ యశోదారెడ్డి మూడు తరాలనూ, ఆ తరాలలో వచ్చిన అనేక మార్పులనూ గమనించారు. గ్రామాల్లో, పట్టణాల్లో వేగవంతంగా వచ్చిన మార్పులు, కుటుంబాల్లో, భావజాలాల్లో వాటి ప్రభావాలూ, తదనుగుణంగా వచ్చిన మార్పులనూ గుర్తించిన ఆమె వాటన్నింటిని తన కథల్లో ప్రస్ఫుటింపజేస్తూ ప్రస్తావించారు.
గ్రామంలో అందరూ ఆమెను ఎచ్చా, ఎచ్చమ్మా అని పిలిచేవారట. సాహిత్యంలోని అనేక ప్రక్రియలను తన కలం ద్వారా సృజించినప్పటికీ పల్లె తెలంగాణను అక్షరాల ఆవిష్కరించిన ఎచ్చమ్మ కథలు ఆమెకు గుర్తింపు నిచ్చాయి. అచ్చమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం తెలంగాణ రచయిత్రిగా చరిత్రలో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణ యానను తన కథల ద్వారా బతికించారు యశోదారెడ్డి.
ప్రతి కథలోనూ తెలంగాణ గ్రామీణ ప్రాంత ఆత్మ అక్షరాల్లో పొదిగి ఉంటుంది. చదివిన తర్వాత పాఠకుల మనసులో ఒదిగిపోతుంది. దక్కన్ రేడియోలో తెలంగాణ మాండలికంలో ప్రసంగాలు చేసిన తొలి రచయిత ఆమె. యశోదారెడ్డి రచనలు భాషాభిమానులకు నిధి. వెతుక్కుంటే అందులో ఎన్నో సామెతలు, ఉపమానాలు, చమత్కారాలు అంతర్లీనమై పాఠకులను అలరిస్తాయి. ఆమె ప్రసంగాలు విని తెలంగాణ భాష ఇంత అందమైన యాస అని చాలా మంది అబ్బురపడేవారట. కథ, కవిత, వ్యాస ప్రక్రియల్లో ఆమె ఎన్నో రచనలు చేశారు.
ఎచ్చమ్మ కథలు బాగా ప్రాచుర్యం పొందిన కథా సంపుటి. ఉగాదికి ఉయ్యాల, భావిక కవితా సంపుటాలు, కథ లూ నవలలూ -ఒక పరిశీలన, కథా చరిత్ర, భారతంలో స్త్రీ, ఆంధ్ర సాహిత్య వికాసం, హరివంశము ఉత్తర భాగము, పారిజాతాపహరణం, తెలుగులో హరివంశములు వ్యాస సంపుటాలుగా వచ్చాయి. కాగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు, సుశీలా నారాయణ రెడ్డి అవా ర్డు, నాళం కృష్ణారావు అవార్డు, సురవరం ప్రతాపరెడ్డి అవార్డులు అందుకున్నారు. ఆమె రచనలపై చాలామంది పరిశోధనలు చేసి డాక్టరేట్‌లు కూడా తీసుకున్నారు. ఎచ్చమ్మ కథల యశోదగా పాఠకుల మనసులో నిలిచిపోయిన వీరు 2007 అక్టోబర్ 7న మరణించారు.
వ్యాసకర్త సెల్: 9848445134
కామిడి సతీష్ రెడ్డి






