7 August, 2026 | 2:30 AM

పాలకులకు చట్టం వర్తించదా?

07-08-2026 12:00 AM

దుప్పటి మొగిలి :

సమాజంలో నాయకులు ఎలా ప్రవర్తిస్తే ప్రజలు కూడా అదే దారిని అనుసరిస్తారని వేల ఏళ్ల క్రితమే పెద్దలు చెప్పారు. నేడు ఆ మాట మరింత ప్రాసంగికంగా కనిపిస్తోంది. దేశ భవిష్యత్తును దాని ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తులు నిర్ణయించవు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలాన్ని నిర్ణయించేది ప్రజా రాజకీయ సంస్కృతే. ఆ రాజకీయ సంస్కృతిని తీర్చిదిద్దేది నాయకుల ప్రవర్తన, వారి భాష, విలువలు.

ఒకప్పుడు రాజకీయ సభలు దేశ నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలకు వేదికలుగా ఉండేవి. నేడు అనేక సందర్భాల్లో రాజకీయ వేదికలు ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా వ్యక్తిగత దూషణలు, ప్రత్యర్థులను కించపరిచే పదజాలం, పరస్పర నిందారోపణల కేంద్రాలుగా మారుతున్నాయనే ఆందోళన పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా ఉదయిస్తున్న ప్రశ్న

సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సాధారణ పౌరులు లేదా పాత్రికేయులపై వేగంగా కేసులు నమోదవుతుండగా, రాజకీయ నాయకుల విషయంలో చట్టం అమలు ఒకే విధంగా లేదనే విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. బహిరంగ సభల్లో రాజకీయ నాయకులు పరస్పరం తీవ్ర పదజాలం ఉపయోగించినా చర్యలు అరుదుగా కనిపిస్తాయి. ప్రజాస్వామ్యంలో పౌరులకు, రాజకీయ నాయకులకు చట్టం ఒకటేనని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నప్పటికీ, ఆచరణలో చట్టం అమలు ఒకే ప్రమాణంతో సాగడం లేదన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ఇది ప్రజాస్వామిక వ్యవస్థల పట్ల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఆర్టికల్ 19(1)(ఏ) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కల్పిస్తే, ఆర్టికల్ 19(2) దేశ భద్రత, ప్రజా శాంతి, పరువు నష్టం, విద్వేష ప్రసంగం వంటి అంశాల్లో సహేతుక పరిమితులను విధించేందుకు అవకాశం ఇస్తుంది. అలాగే ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులనే సూత్రాన్ని ప్రకటిస్తుంది.

నాయకులపై కూడా గతంలో పరువు నష్టం, విద్వేష ప్రసంగాల కేసులు నమోదైన సందర్భాలు ఉన్నప్పటికీ, చట్టం పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా అమలవుతుందనే విశ్వాసాన్ని కల్పించడం అత్యంత అవసరం. నాయకులను చట్టం ఎందుకు వెంటాడదు? వేదికపై తిట్టడం నాయకత్వ లక్షణమా? పిల్లలకు మర్యాద నేర్పే సమాజం, నాయకుల మాటలను ఎం దుకు ప్రశ్నించదు? అనే ప్రశ్నలకు సమాధా నం నిష్పాక్షికమైన, సమానమైన చట్టం అమలులోనే ఉంది.

అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి ప్రజాస్వామ్య దేశాల్లో కూడా రాజకీయ వాగ్వివాదాలు తీవ్రంగానే ఉంటాయి. అయితే పార్లమెంటరీ సంప్రదాయాలు, సభా నియమాలు, మీడియా పరిశీలన, ప్రజల స్పందన వల్ల వ్యక్తిగత దూషణలకు కొన్ని పరిమితులు ఏర్పడతాయి. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం బలపడేది కేవలం చట్టాలతో కాదు. రాజకీయ సంస్కృతి, ప్రజల అప్రమత్తత, స్వతంత్ర మీడియా, బలమైన సంస్థలతో కూడిన సమిష్టి వ్యవస్థ వల్ల.

మన దేశంలో ఇది పరిస్థితి

మహాత్మాగాంధీ బ్రిటిష్ ప్రజలను కాదు, పాలనను వ్యతిరేకించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టేది కేవలం రాజ్యాంగం కాదని, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తుల నైతికత మీదనే దాని గొప్పతనం ఆధారపడి ఉంటుందని అంబేద్కర్ వివరించారు. భారత రాజకీయాల్లో వాజ్‌పేయి  వాదన, విమర్శల్లో పదునును, మాటల్లో సంస్కారాన్ని సమానంగా పాటిస్తూ ప్రజాస్వామ్య సంభాషణకు ఒక ఉన్నత ప్రమాణాన్ని ఏర్పరిచారు.

కలాం చెప్పినట్లు యువత నాయకులు చెప్పే మాటల కంటే వారి ప్రవర్తన నుంచే ఎక్కువగా నేర్చుకుంటుంది. కాబట్టి, సభల్లో అసభ్య పదజాలం కాకుండా గౌరవప్రదమైన భాషను ప్రదర్శించినప్పుడే ప్రజాస్వామ్య విలువలు బలపడతాయి. భావప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిదని స్పష్టం చేసిన భారత సుప్రీంకోర్టు, అదే సమయంలో ద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని పదేపదే పునరుద్ఘాటించింది.

దీనిని బట్టి స్వేచ్ఛ ఎంత ఉందో బాధ్యత కూడా అంతే ఉందని అర్థం చేసుకోవాలి. ఆలోచనలపై పోరాడాలే తప్ప వ్యక్తులపై కాదనే సూత్రం రాజకీయ నాయకులకైనా, సాధారణ పౌరులకైనా సమానంగా వర్తిస్తుందని స్పష్టమవుతున్నది. యుక్తవయస్సులో వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. యువత క్రీడాకారులను, సినీ నటులను, సామాజిక మాధ్యమ ప్రభావశీలులను, రాజకీయ నాయకులను అభిమానిస్తారు.

ప్రతిరోజూ తన అభిమాన నాయకుడు ప్రత్యర్థిని అవమానిస్తూ మాట్లాడడాన్ని చూస్తూ పెరిగితే, వాదనకు బదులు దూషణే ఆయుధమని అతను నేర్చుకునే అవకాశం ఉంది. అసభ్య భాషే ధైర్యమని, ప్రత్యర్థిని అవమానించడమే విజయమని భావించే ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడే ప్రతి మాట నేడు టీవీ, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా క్షణాల్లో లక్షలా ది మందికి చేరుతోంది.

అందువల్ల వారి మాట వ్యక్తిగతం కాదు, అది సామాజిక బాధ్యత. అవమానకర వ్యాఖ్యలు, వ్యక్తిగత లేదా కుటుంబ అంశాలపై దూషణలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించి, అభిమానులు ప్రత్యర్థుల మధ్య వాదనలు, పోస్టులు, ఘర్షణలకు దారితీస్తాయి.

రాజకీ య వేదికలు అసభ్య పదజాలం, వ్యక్తిగత విమర్శలు, పరస్పర దూషణలకు వేదికలుగా మారితే, అది ప్రత్యర్థులను మాత్రమే కాదు, మొత్తం రాజకీయ సంస్కృతినే దిగజారుస్తుంది. నాయకుడి ప్రవర్తనే అనుచరుల ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది.నాయకుడు కోపాన్ని, ద్వేషాన్ని ప్రోత్సహిస్తే అనుచరులు, అభిమానులు అనుసరించే అవకాశం ఉంటుంది. అందుకే నాయకుడి భాష సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా నిలుస్తుంది.

గౌరవం దెబ్బతింటుంది

నాయకుల దూకుడు వ్యాఖ్యలు, తిట్ల రాజకీయాలు ప్రజాస్వామ్య విలువలను మాత్రమే కాదు, సమాజపు పునాదులను కూడా దెబ్బతీస్తున్నాయి. రోడ్లు, ఉపాధి, విద్య, వైద్యం వంటి ప్రజా సమస్యలు చర్చకు దూరమవుతుండగా, ఆవేశపూరిత వ్యాఖ్యల ప్రభావంతో యువత సోషల్ మీడియాలో పరస్పరం ఘర్షణలకు దిగడం, కేసులు ఎదుర్కోవడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. వారి భాష సోషల్ మీడియా వేదికలను విషపూరితంగా మారుస్తోంది.

ప్రజల్లో మర్యాదగా మాట్లాడేవారిని బలహీనులుగా, దూషించేవారిని బలవంతులుగా చూసే అపోహలు పెరగడం కూడా ఆందోళనకరం. అసభ్య భాష సాధారణమైతే పిల్లలు, యువత దానిని అనుకరించే ప్రమాదం ఉంది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు మర్యాద నేర్పుతుంటే, ప్రజావేదికలపై నాయకులు అసభ్యంగా ప్రవర్తించడం పిల్లలలో, యువతలో గందరగోళానికి దారితీస్తోంది.

కాబట్టి నాయకుల రెచ్చగొట్టే మాటలకు బలికాకుండా, ప్రజా సమస్యలపై చైతన్యంతో స్పందించడం, బాధ్యతాయుతమైన రాజకీయ సంభాషణను ప్రోత్సహించడం నేటి సమాజానికి అత్యవసరం. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ పాలనే కాదు, విభిన్న అభిప్రాయాలను గౌరవించే సంస్కృతి కూడా. ప్రజలను విభజించడానికో, ప్రత్యర్థులను అవమానించడానికో కాదు, సమస్యలను పరిష్కరించడానికి, విధానాలను వివరించడానికి రాజకీయాలు ఉన్నాయి.

అందుకే రాజకీయ పార్టీలకు ప్రజా సంభాషణపై స్పష్టమైన ప్రవర్తనా నియమావళి అవసరం. ద్వేష ప్రసంగాలపై చట్టాలను పక్షపాతం లేకుండా అమలు చేయడం, విద్యాసంస్థల్లో రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచడం, మీడియా విధానపరమైన చర్చలకు ప్రాధాన్యం ఇవ్వడం, సోషల్ మీడియా వినియోగదారులు నిజానిజాలు నిర్ధారించి సమాచారాన్ని పంచుకోవడం అత్యవసరం.

ప్రజాస్వామ్య భవిష్యత్తు పార్లమెంట్‌లో చేసే చట్టాలతో మాత్రమే కాదు గ్రామసభల నుంచి సోషల్ మీడియా వరకు మన మాటలు, ప్రవర్తన, రాజకీయ సంస్కృతితో నిర్మితమవుతుంది. అసభ్య భాష ప్రజాస్వామ్యాన్ని బలపరచలేదు. ప్రసంగం ఓ కళ, విమర్శ ఓ బాధ్యత, విభేదం ఒక హక్కు. ప్రత్యర్థిని ఓడించడం రాజకీయ విజయం అయితే, గౌరవించడం రాజకీయ పరిపక్వత. ప్రజలు తిట్ల రాజకీయాలను ఓట్లతో తిరస్కరించి, విధానపరమైన చర్చలు చేసే, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడిన నాయకులను ఆదరించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.

 వ్యాసకర్త సెల్: 8466827118