ఆశ్రమ పాఠశాలలో ప్రతిరోజు శుభ్రత పాటించాలి..
ప్రతి విద్యార్థి పరిశుభ్రత పాటించాలి..
ఉట్నూర్, జులై 9 ( విజయక్రాంతి): ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలతో పాటు ప్రతి పాఠశాలలో ప్రతిరోజు పరిశుభ్రత పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు వైద్యాధికారి డాక్టర్ కుడిమేత మనోహర్ అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలోని వంట గదులు, స్టోర్ రూమ్, హాస్టల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రతి విద్యార్థి చేతులు కడుక్కునే పద్ధతులను, వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై విద్యార్థులతోపాటు ఆశ్రమ పాఠశాల సిబ్బందికి, ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.
ఆశ్రమ పాఠశాల నిర్వహించిన ఆర్ బి ఎస్ కే వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి సూచనలు చేస్తూ ప్రతి విద్యార్థి ల్యాప్ ప్రొఫైల్ కు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అనంతరం ఈశ్వర్ నగర్ సబ్ సెంటర్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇండ్లలో నీటి నిలువ ఉన్న వాటిని శుభ్రం చేయించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆర్ఎఫ్ఎస్ సర్వే నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. ఆయనతోపాటు జి సి డి ఓ మెస్రం ఛాయా, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాథోడ్ ప్రకాష్, హెచ్ఈ ఓ నాందేవ్, హెల్త్ సూపర్వైజర్ సురేష్ పవార్ తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






