పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం
వైఎస్సార్ నగర్లో వైభవంగా ’ఫ్రైడే-డ్రైడే’..
దోమల నివారణపై ఇంటింటి అవగాహన!
కీసర సర్కిల్ డీసీ జి.రామలింగం
జవహర్‌నగర్, ఆగస్టు 7 (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలమని దోమల నివారణకై ప్రతి ఒక్కరు ఇంటింటికి అవగాహన కల్పించాలని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి. రామలింగం పిలుపునిచ్చారు. మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు, కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రామలింగం ఆధ్వర్యంలో ఎంటమాలజీ విభాగం శుక్రవారం రోజున ‘ఫ్రైడే - డ్రైడే‘ దోమల నివారణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కీసర సర్కిల్ పరిధిలోని జవహర్నగర్ డివిజన్, వైఎస్సార్ నగర్ కాలనీలో ఈ ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టారు.
విద్యార్థులకు అవగాహన
అనంతరం స్థానిక గవర్నమెంట్ హై స్కూల్లో విద్యార్థులకు ‘దోమ పుట్టకుండా.. దోమ కుట్టకుండా‘ తీసకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం ‘డ్రై డే‘గా పాటించి ఇళ్లలోని నీటి పాత్రలను శుభ్రం చేసుకోవాలని కోరారు.పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలమని, ప్రతి ఒక్కరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించి దోమల నివారణకు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఈ భాస్కర్, తిరుపతి రాజ్, వార్డ్ ఎంటమాలజీ సూపర్వైజర్లు శ్రీనివాస్, స్వామిలతో పాటు కాలనీ ప్రతినిధులు, ఎంటమాలజీ విభాగం సిబ్బంది, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






