14-05-2025 01:18:51 AM
కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
సిరిసిల్ల, మే 13 (విజయ క్రాంతి): సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తంగళ్ళపల్లి, గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల తరగతి గదులన్నింటిని తిరిగి పరీక్ష విధానాన్ని తనిఖీ చేశారు.
పాఠశాలలో ఏర్పాటుచేసిన సీ.సీ.టి.వి. కెమెరాలు పనితీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తంగళ్ళపల్లి జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ శంకర్ నారాయణ ఆదేశించారు.
అదే విధంగా పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరుకు మోటర్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ కోరగా పంచాయతీ సెక్రటరీకి ప్రతిపాదనలు సమర్పించవలసిందిగా ప్రిన్సిపల్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపర్డెంట్లు శంకర్ నారాయణ, శారద, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
95 శాతం మంది హాజరు
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో మంగళవారం పాలిసెట్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా పరీక్షల కోఆర్డినేటర్ ప్రభాకరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల, సిరిసిల్ల బాలుర జూనియర్ కళాశాల, కుసుమ రామయ్య జడ్పీహెచ్‌ఎస్, గీతా నగర్ జడ్పిహెచ్‌ఎస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం, జడ్పిహెచ్‌ఎస్ నెహ్రూ నగర్, జెడ్పిహెచ్‌ఎస్ తంగళ్ళపల్లిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఏడు పరీక్ష కేంద్రాల్లో కలిపి 2,136 విద్యార్థులు పరీక్ష రాయాల్సిఉండగా, 2,027 మంది హాజరు అయినట్లు జిల్లా కో ఆర్డినేటర్ తెలిపారు. బాలురు 894 మంది, బాలికలు 1,133 మంది కలిపి మొత్తం 2,027 మంది, 94.89 శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు.