calender_icon.png 14 May, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిటీలతో కాలయాపన వద్దు

14-05-2025 01:17:33 AM

  1. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించండి
  2. ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి
  3. 15న తలపెట్టిన నిరసన కార్యక్రమాలు వాయిదా
  4. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్పష్టీకరణ

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. తమకు దేశ రక్షణే ముఖ్యమని, తర్వాతే తమ ఉద్యోగుల హక్కుల పోరాటమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఈక్రమంలోనే ఈనెల 15న తలపెట్టిన భోజన విరామ సమయంలో నిరసన ప్రదదర్శనల కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగుల జేఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ, ఆ తర్వాత క్యాబినెట్ సబ్‌కమిటీ, తాజాగా అధికారుల కమిటీ అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఇలా కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దని సమావేశంలో తీర్మానించినట్టు తెలిపారు.

భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేవలం నిరసన ప్రదర్శనను మాత్రమే తాత్కాలికంగా వాయిదా వేశామని, ముందస్తుగా ప్రకటించిన తదుపరి ఉద్యమ కార్యాచరణ యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సాధారణ బదిలీలు-2025 ఏప్రిల్, మే నెలల్లోనే చేపట్టాలని కోరారు. మాజీ ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల జేఏసీకి మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించొద్దని కోరారు.

త్వరలో క్యాబినెట్ సబ్ కమిటీతో అధికారుల కమిటీ సమావేశమై మరోసారి ఉద్యోగుల జేఏసీతో చర్చలు జరిపిన తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఈ సమావేశంలో తీర్మానించినట్టు తెలిపారు. సమావేశంలో జేఏసీ నాయకులు పీ దామోదర్ రెడ్డి, చావా రవి, జీ సదానందం గౌడ్, మధుసూదన్ రెడ్డి, ఏ సత్యనారాయణ, ముజీబ్, బీ శ్యామ్, అంజిరెడ్డి, కటకం రమేశ్, ఎం చంద్రశేఖర్ గౌడ్, వీ రవీందర్‌రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.

నివేదిక వచ్చేదెప్పుడు!

తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికోసం ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో కమిటీ వేసిన విషయం తెలిసిం దే. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈనెల 6న విడుదల చేసింది. ఉద్యోగులతో చర్చలు జరిపి ఏడు రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అందులో పేర్కొంది.

ఇందులో భాగంగానే కమిటీ తొలి సమావేశాన్ని ఈనెల 7న నిర్వహించి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించింది. త్వరలో మరోసారి భేటీ కావా ల్సి ఉంది. అయితే ప్రభుత్వానికి కమిటీ నివేదికను ఎప్పుడు ఇస్తుందోనని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నారు.