19 April, 2026 | 2:08 AM

మాపై రాజకీయ కుట్ర

19-04-2026 12:56 AM
  1. మున్నూరు కాపుల జనాభా నివేదికను ఖండించిన మున్నూరుకాపు ఎంపీలు, సీనియర్ నేతలు, కులపెద్దలు 
  2. ప్రభుత్వ కులగణన పూర్తి తప్పుల తడకని ఆగ్రహం 
  3. కుట్రలపై మున్నూరు కాపులు పోరాడాలని పిలుపు
  4. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందామని నిర్ణయం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: మున్నూరు కాపులను రాజకీయంగా, సామాజికంగా అణచివేసేందుకు పాలక ప్రభుత్వ వర్గాల స్థాయిలోనే కుట్రలు ప్రారంభమయ్యాయని, వీటిని తక్షణమే తిప్పి కొట్టకపోతే కుల సమాజ ఉనికికే ప్రమాదం అని అన్ని పార్టీల మున్నూరు కాపు నేతలు స్పష్టం చేశారు.

తమ హక్కులను కాపాడుకునేందుకు, తమ మీద జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు, పార్టీలకు, భావజాలాలకు అతీతంగా, తెలంగాణ రాష్ట్ర మున్నూరుకపులంతా ఐక్యం కావలసిన అత్యవసర పరిస్థితి తలెత్తిందన్నారు. రాజకీయంగా, సామాజికంగా అణచివేయడానికి, ఆధిపత్య పాలక వర్గాల నుంచి, మున్నూరు కాపుల మీద జరుగుతున్న ఉద్దేశపూర్వక దాడులను, వివక్షపూరిత ధోరణులను తీవ్రంగా తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.

ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ పటేల్, కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పటేల్, బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రపటేల్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వీ హనుమంతరావు పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ పటేల్, వంటి ప్రముఖులు, తదితర కుల పెద్దలతో మున్నూరు కాపు ఫౌండేషన్ ట్రస్ట్ బాధ్యులు ఢిల్లీలో శనివారం సమావేశమయ్యారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం కోకాపేటలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. మున్నూరు కాపు ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ స్థలంలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఆర్థికవనరులు తదితర సమన్వయలోపాల కారణంగా పనులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో, భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఫౌండేషన్ ట్రస్ట్ బాధ్యుల ఆధ్వర్యంలో రెండు రోజుల ఢిల్లీ పర్యటన జరిగింది.

ఈ సందర్భంగా మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు, కులం ఎదుర్కొంటున్న సమస్యల విస్తృతమైన చర్చలు జరిపారు. త్వరలోనే.. కుల పెద్దలు శ్రేయోభిలాషులు, దాతలు తదితరులతో సమావేశమై, భవన నిర్మాణం పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తక్షణమే కార్యక్రమాలను రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు సమాజాన్ని ఐక్యం చేసి, హక్కులను కాపాడుకునే దిశగా పోరాటాలకు పిలుపునివ్వాలని నిర్ణయించారు.

కాగా హైదరాబాద్‌లో సమావేశమై ఎందుకు సంబంధించి కార్యాచరణను ప్రకటించనున్నట్లు మున్నూరు కాపు సంఘం, ట్రస్ట్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో.. మున్నూరు కాపు ఫౌండేషన్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రైతు కనకయ్య పటేల్, సభ్యులు మంగళారపు లక్ష్మణ్ పటేల్, పన్నాల విష్ణువర్ధన్ పటేల్, రమేష్ హజారి పటేల్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుటం పురుషోత్తం పటేల్, రాష్ట్ర నాయకులు ఈసంపల్లి వెంకన్న పటేల్, కాశటి కుమార్‌పటేల్ ఆవుల రామారావు పటేల్, ప్రముఖ మ్యూజిషియన్ సామల వేణు, వెంగళరమేశ్, మహిళానేతలు కొణతం దీపిక, ఆకుల శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.