calender_icon.png 7 December, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరుకు క్లియరెన్స్ తేవాలి

07-12-2025 12:48:52 AM

ఇరిగేషన్ అధికారులకు ఆదేశం

  1. తుమ్మిడిహట్టి డీపీఆర్ సిద్ధం చేయాలి 
  2. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
  3. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): పాలమూరు--రంగారెడ్డి ప్రాజెక్టు కు సీడబ్ల్యూసీ క్లియరెన్స్ తీసుకువచ్చే దిశగా కృషిచేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో సాగునీటి శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్రం వద్ద పెండింగులో ఉన్న ప్రా జెక్టులపై చర్చించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాక మొదటి ప్రాధాన్యతగా ప్రాజెక్టును పూర్తిచేయాలన్నారు.  సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు సైతం సీడబ్ల్యూసీ క్లియరెన్స్ లేకపోవడంతో దాని పురోగతిపై సమీక్షించారు. త్వరలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో మంత్రి తాజా సమీక్షలోనూ ఈ అంశంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.

రెండు నెలల్లోనే ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించారు. అయితే డీపీఆర్ తయారీకి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పినప్పటికీ.. రెండు నెలల్లోనే ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్‌ఏ ఇచ్చి న నివేదిక ఆధారంగా బ్యారేజీలకు మరమ్మతులు చేయించాలని ప్రభుత్వం అధికా రులను ఆదేశించింది. అయితే.. దీనికి సం బంధించి చర్యలు చేపట్టాలని మంత్రి సూ చించారు.

మరోవైపు రిపేరుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం టెండర్లను సైతం ఆహ్వానించింది. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తిచేసి ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని మంత్రి తాజాగా సూచించారు. దీంతోపాటు ఏపీ ప్రభుత్వం నిర్మిం చతలపెట్టిన పోలవరం--నల్లమల సాగర్ ప్రాజెక్టుపైనా ఈ సమావేశంలో చర్చించారు. గతంలో ఏపీ ప్రభుత్వం పోలవరం--బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు మొగ్గు చూపగా.. ఆ నిర్ణయాన్ని విరమించుకొని తాజాగా పోలవరం--నల్లమలసాగర్‌ను తెరమీదకు తెచ్చింది.

అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ కోసం టెండర్లనూ ఆహ్వానించింది. అయితే.. డీపీఆర్ అంశంపై ఈ సమావేశంలో కీలక చర్చించనట్లు అధికారులు తెలిపారు. మరోసారి కేంద్రం వద్దనే ఈ అంశంపై తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. అందులోభాగంగానే మంత్రి ఈ సమీక్ష సమావేశం నిర్వహించారని తెలిసింది.

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులపై కేంద్రానికి పంపించే లేఖలపైనా ఇందులో చర్చించారు. ఐఎస్డబ్ల్యూఆర్ విభాగం, సీడీఓ విభాగాల బలోపేతంపైనా అధికారులతో చర్చించారు. సాగునీటి శాఖలో ఉద్యోగుల పదోన్నతులు కల్పించడంపైనా ప్రత్యేక చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో ఇద్దరు ఇంజినీర్ల నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.