07-12-2025 01:04:44 AM
సూర్యాపేట, డిసెంబర్ 6 (విజయక్రాంతి) : ‘క్వార్టర్‌కో, హాఫ్‌కో, ఫుల్‌కో ఆశప డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పొంకనాల పోషిగాళ్లకు ఓటెయొద్దు.. మంచివారికి అవకాశం ఇస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఆరు నూరైనా ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్‌ను ఈ ప్రభుత్వంలో పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నల్లగొం డ ప్రజలపై కక్ష కట్టి ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు.
పదేండ్ల పాలనలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్ కుటుంబీకులు దోచుకున్నారని ఆరోపించారు. మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ఆక్షేపించారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అధ్యక్షత ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మె ల్యేలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా దేవరకొండలో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, జూనియర్ కళాశాలలో స్టేడియం, వాకింగ్ ట్రాక్, బీఎన్‌ఆర్ కాలనీలో పార్క్ పనులకు సీఎం శం కుస్థాపన చేశారు. అనంతరం శేరిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ లో ప్రజలనుద్దేశించి సీఎం ప్రసగించారు.
ఎస్సెల్బీసీ పనులపై వివక్ష..
నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యల రూపుమాపేందుకు ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాం గ్రెస్ ప్రభుత్వం ఎస్సెల్బీసీ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. 2 వేల కోట్లతో పనులను ప్రారంభించి 30 కిలోమీటర్లు టన్నెల్ పూర్తి చేస్తే నల్లగొండ ప్రజలపై పగబట్టిన గత ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తి చేయకుండా పడావు పెట్టిందని ఆక్షేపించారు. ఎస్సెల్బీసీ సొరంగ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు 8 మంది చనిపోతే ఇక పనులు జరగవని మామా అల్లుళ్లు పైశాచిక ఆనందంతో డ్యాన్స్ చేశారని పరోక్షంగా మాజీ సీఎం, హరీశ్‌రావులను సీఎం విమర్శించారు. కేసీఆర్, హరీశ్‌రావు నాగార్జున సాగర్ , శ్రీశైలంలో బండ కట్టుకుని దూకినా ఎస్సెల్బీసీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేసి దేవరకొండ ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తీరుస్తామన్నారు.
రేషన్ కార్డు కూడా ఇవ్వలే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని సీఎం విమర్శిం చారు. పేదలకు కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిమడ్డారు. ప్రజాప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని చక్కదిద్ది అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఒక్క దేవరకొండలోనే 14 వేల రేషన్ కార్డులు ఇచ్చామని రాష్ట్రంలోనే ఇది అత్యధికమని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం పంపి ణీ చేసి పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు.
ప్రజాపాలనలో మంచి రోజులు..
కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని సీఎం పేర్కొన్నారు. ప్రజాపాలనలో పేదలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యం, రేషన్ కార్డు ఇలా ఎన్నో సంక్షేమాలు వచ్చాయన్నారు. రెండేళ్లలో నిరుద్యోగ యువతకు 61 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.
దేవరకొండకు వరాల జల్లు..
దేవరకొండలో దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చదువుకున్న పాఠశాలకు రూ. 6 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పట్టణంలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూర్తి చేసే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. దేవరకొండలో నర్సిం గ్ కళాశాల నిర్మాణానికి వెంటనే అంచనాలు రూపొందించాలని సభా వేదికగా కలెక్టర్‌ను ఆదేశించారు. నియోజవర్గంలో రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ నెలాఖరులోపు జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి అడ్లూ రి లక్ష్మణ్, మంత్రి సీతక్కను పంపి అన్ని ప నులకు అంచనాలు రూపొందించి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మద్దిమగుడును మరింత అభివృద్ధి చేస్తాం
దేవరకొండ వెంటే ఉన్న నాగర్కర్నూల్ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగు పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు.సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయిస్తామని పేర్కొ న్నారు. ఈ నెల 8, 9న మహేశ్వరంలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాలను ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తామన్నారు.
రోల్ మోడల్ గా తెలంగాణ
ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం వివరించారు. విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. దేశానికి తెలంగాణను రోల్ మోడల్‌గ్గా నిలుపుతామన్నా రు. క్వార్టర్, హాఫ్ట్, ఫుల్‌కో ఆశపడి స్థానిక ఎన్నికల్లో పొంకనాల పోషిగాళ్లకు ఓటెయొద్దని, మంచివారికి అవకాశం ఇచ్చి గ్రామా లను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, తుంగతుర్తి ఎమ్మెల్యే లు నేనావత్ బాలూనాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్రెడ్డి, మందుల సామే ల్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.
పేదలకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్సే..
రాష్ట్రంలో పేదలందరికీ గూడు నిర్మించి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 --2014 వరకు మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి 25 లక్షల ఇండ్లు నిర్మించి ఇచ్చారని గుర్తు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇస్తానని దారుణంగా మోసగించిందని ఆరోపించారు. కేసీఆర్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కొనసాగించి ఉంటే పదేండ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించే అవకాశముండేదని పేర్కొన్నారు.
పేదల ఇంటికి రూ. 2 లక్షలు ఇవ్వని కేసీఆర్ తానుమాత్రం 2 వేల కోట్లతో ఇంటిని నిర్మించుకొని భోగాలు అనుభవించారని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వంలో పేదల ఆత్మగౌరవం నిలిపేలా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రూ. 22, 500 కోట్లతో రాష్ట్రంలో 4 లక్షల 50 వేల ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. చెంచులు, ఐటీడీఏ ప్రాంతాల్లో పేదలకు 25 వేల ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేక జీఓ ఇచ్చినట్లు గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్‌కు కేటీఆరే గుదిబండ..
నలుగురు సర్పంచ్‌లు, వార్డులను కూర్చోబెట్టుకొని మాట్లాడే స్థితికి మాజీ సీఎం కేసీఆర్ చేరారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ అరాచకాలకు భయపడే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ అధికారం ఊడగొట్టి పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాచుట్టించారని ఎద్దేవా చేశారు. మొన్న రెఫరెండమ్ అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు వెళ్తే బోరబండ దగ్గర ప్రజలు బండకేసి బాది బొందపెట్టారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పార్టీకి కేటీఆరే గుదిబండని ఆ బండ ఉన్నన్నాళ్లూ ఆ పార్టీని ప్రజలే బొందపెడతారని అన్నారు.
ఉచిత విద్యుత్ పేటెంట్ మాదే..
గత ప్రభుత్వం నాలుగు విడతల్లో రైతులకు రూ. లక్ష పంట రుణమాఫీ చేస్తే వడ్డీకే సరిపోయిందన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల 35 వేల మంది రైతులకు 20,614 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన ఘనత ప్రజాప్రభుత్వానిదేనని చెప్పారు. సాగుకు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 2004లోనే రూ.12,400 కోట్లతో రైతుల వ్యవసాయ మోటార్ల బిల్లులు మాఫీ చేశారని గుర్తు చేశారు.