ఏటికి దగ్గర.. నీటికి దూరం!
- తలాపునే తాలిపేరు.. చర్లకు చేరని సాగునీరు
- ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిన వద్దిపేట చెక్‌డ్యాం
- ప్రభుత్వాలు మారినా మారని గిరిజనుల తలరాత
- సర్వేలకే పరిమితమైన చెక్‌డ్యాం నిర్మాణం
- మూడు దశాబ్దాల కల ఇప్పటికైనా నెరవేరేనా?
చర్ల, జూన్ 17: గోదావరి వృథా జలాలను మళ్లించి బీడు భూములను సస్యశ్యా మలం చేస్తామన్న నేతల మాటలు నీటిమీది రాతలుగానే మిగులుతున్నాయి. మూడు దశాబ్దాలుగా అక్కడి గిరిజనుల సాగునీటి కల నెరవేరడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా వారి తలరాతలు మారడంలేదు. తలాపునే తాలిపేరు ఉన్నా సాగునీరు అందే దారిలేక గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు మండలమైన చర్లలో గిరిజనుల సాగునీటి గోడు కొత్త ప్రభుత్వంలోనైనా తీరేనా అని గంపెడు ఆశతో ఉన్నా రు. మండల పరిధిలోని పూసుగుప్ప బోయినపల్లి గ్రామాల మధ్య తాలిపేరుపై చెక్‌డ్యాం నిర్మిస్తే ఆప్రాంతంలోని 22 గ్రామాల్లో 10వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది.
ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం తాలిపేరుపై వద్దిపేట వద్ద చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అప్పటి భారీ నీటిపారుదలశాఖ మంత్రి, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెక్‌డ్యాం నిర్మాణానికి సర్వే కూడా చేయించారు. తొలుత వద్దిపేట వద్ద చెక్‌డ్యాం నిర్మించాలని యోచిస్తే పక్క రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అనుమతితో పాటు, ఫారెస్టు అనుమతులు అవసరం ఉందని తేలింది. దీంతో చెక్‌డ్యాం నిర్మాణానికి ఫుల్‌స్టాఫ్ పడింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో నేతలు ఓట్ల కోసం చెక్‌డ్యాంను ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారే తప్ప గిరిజన రైతుల గోడు పట్టించుకునే వారే కరువయ్యారు.
ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జలయజ్ఞంలో చెక్‌డ్యాం నిర్మిస్తామని చెప్పారు. అదీ కార్యరూపం దాల్చలేదు. ఆప్పటి జెడ్పీ చైర్మన్ చందా లింగయ్య పాదయాత్ర సందర్భంగా ఐటీడీఏ పీఓకు పలుమార్లు చెక్‌డ్యాం నిర్మాణంపై వినతులు అందజేశారు. అయినా ఫలితంలేదు. పోరాడి తెచ్చుకొన్న తెలంగాణ ప్రభుత్వంలో 2018 ఎన్నికల సందర్భంగా వద్దిపేట ప్రస్తావన తెరపైకి తెచ్చి మళ్లీ ఓట్లు దండుకొన్నారు. అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినా, నూటికి నూరుశాతం గిరిజనులకు లబ్ద్ధి చేకూరే వద్దిపేట చెక్‌డ్యాంను చిన్నచూపు చూసింది. పుష్కలంగా వనరులుండి, సారవంతమైన నేలలున్నా నీరులేక బీళ్లుగా మారుతున్నాయి.
చెక్‌డ్యాం నిర్మాణానికి అనుమతుల గ్రహణమా, లేక నేతల చిత్తశుద్ధి లోపమా? అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. మారుమూల చర్ల మండలంలో గతంలో తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి గిరిజనులు ఇప్పటికీ మర్చిపోలేరు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆప్రాంతపై పూర్తి అవగాహన కల్గిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా కొనసాగుతున్నారు. వద్దిపేట వద్ద నిర్మించ తలపెట్టిన చెక్‌డ్యాంను ఒక కిలో మీటరు తర్వాత ఛత్తీస్‌గఢ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన బోయినపల్లి ప్రాంతంలో నిర్మిస్తే ఆ రాష్ట్ర అనుమతి అవసరం లేదు. కేవలం ఫారెస్టు అనుమతులతో సరిపోతుంది.
ప్రభుత్వ సర్వేలు జరిగిన పూసుకుప్ప పంచాయతీ పరదిలోగల వద్దిపేట వద్ద కాకుండా అదే పంచాయితీలో గల బోయినపల్లి లో చెక్ డ్యాం నిర్మిస్తే పూసుగుప్ప, వద్దిపేట, ఉంజుపల్లి, పూజారిగూడెం, సింగ సముద్రం, మల్లా రం, లెనిన్‌కాలనీ, గన్నవరం, ఉప్పెరిగూడెం, రేగుంట, సుబ్బంపేట, కొయ్యూరు వంటి 22 గ్రామాల చెరువులకు కాలువ ద్వారా నీరు అందే అవకాశం ఉంది. కావునా కొత్త ప్రభుత్వం బోయినపల్లి ప్రాంతంలో తాలిపేరు ఎడమ కాలువకు అనుసంధానంగా చెక్‌డ్యాం నిర్మిస్తే ఆప్రాంతంలోని 22 గ్రామాల్లో 10వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి తమ ఆశలు నెరవేర్చాలని గిరిజన రైతులు కోరుతున్నారు.






