10-11-2025 01:22:45 PM
- ఖమ్మం కేంద్రంగా జరిగే బహిరంగ సభకు భారీగా తరలిరావాలి
- 40 దేశాల నుండి రానున్న ప్రతినిధులు
- 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ
భద్రాచలం,(విజయక్రాంతి): పీడిత తాడిత ప్రజల జీవితాలకు భరోసా కల్పించేందుకు దేశ స్వతంత్రానికంటే ముందే ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శత వసంత ముగింపు సభ ఖమ్మం కేంద్రంగా జరగనుందని ఈ బహిరంగ సభను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రవికుమార్ అన్నారు. శత వసంత ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక డివిజన్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత గడ్డపై కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి ఈ డిసెంబర్ 26వ తేదీ నాటికి వందేళ్లు పూర్తి అవుతుందని, భారత స్వతంత్ర సంగ్రామంలో బానిస సంకెళ్ళ నుండి భరత మాత విముక్తి కోసం కమ్యూనిస్టు కార్యకర్తలు అలుపెరగని పోరాటాలు చేశారని అన్నారు. భగత్ సింగ్ లాంటి యువ కిషోరాలు నమ్మిన సిద్ధాంతం కోసం ఉరి కొయ్యలను ముద్దాడారని గుర్తు చేశారు. ఆనాటి నుండి నేటి వరకు పీడిత ప్రజల పక్షాన నిలబడింది ఎర్రజెండా నేనని, ఎర్రజెండాల పని అయిపోయిందని అవహేళన చేసిన వారికి ఈ శతవసంత ఉత్సవాల బహిరంగ సభ ఒక గుణపాఠం కావాలని చెప్పారు.
40 దేశాల నుండి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు, మేధావులు కవులు కళాకారులు ఉత్సవ ముగింపు సభకు తరలివస్తున్నారని, ఈ బహిరంగ సభను మరింత ఎరుపెక్కించేందుకు తమ తమ ప్రాంతాల నుండి కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. 5 లక్షల మందితో ఖమ్మం కేంద్రంగా జరిగే ఉత్సవాల ముగింపు సభ దేశానికే గర్వకారణం కానుందని, ఎర్ర జెండా నీడలో ఆమరులైన ప్రతి ఒక్కరికి ఈ శతవసంత ఉత్సవం అంకితం కావాలని ఆకాంక్షించారు.