calender_icon.png 23 December, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీ వేణుగోపాల్‌తో సీఎం భేటీ

07-02-2025 01:52:08 AM

  1. కులగణన, వర్గీకరణ, స్థానిక ఎన్నికలపై చర్చ 
  2. నేడు ఖర్గే, రాహుల్‌తోనూ సమావేశం
  3. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చ 

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజ యక్రాంతి): ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహే శ్‌కుమార్‌గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో భేటీ అయ్యా రు.

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. వీటితోపాటు పీసీసీ కార్యవర్గ కూర్పు, త్వరలో జరగబో యే స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుస రించే వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది.

పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్  నియమితులైన నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. ఇంకా పాత కార్యవర్గాన్నే కొనసాగిస్తున్నారు. కొత్త కార్యవర్గంలో చోటుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. మంత్రులు, జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇప్పటికే సలహాలు, సూచనలు తీసుకుని ఒక నివేదిక తయారుచేశారు.

నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో ప్రధానమైన అంశం మంత్రివర్గ విస్తరణపై ఈ టూర్‌లో తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏడాదికాలంగా మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే.

వీటి కోసం డజన్ మంది ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనతో ఉన్నారు. వీటన్నింటిపై పార్టీపెద్దలతో చర్చించి తుదినిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.