18 March, 2026 | 1:21 AM

ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి

17-03-2026 10:17 PM

– బీజేపీ మండల అధ్యక్షుడు మిరియాల కర్ బాలాజీ

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బీజేపీ మండల అధ్యక్షుడు మిరియాల కర్ బాలాజీ డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కోనరావుపేట తహసీల్దార్ వరలక్ష్మికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

భూ సమస్యల పరిష్కారానికి భూభారతి కార్యక్రమం చేపట్టినప్పటికీ ఇప్పటివరకు ప్రజల భూసమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచి అందజేయాలని డిమాండ్ చేశారు.

అలాగే కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.రైతులకు రైతు భరోసా అందజేయాలని, రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. మండల పరిధిలోని ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన తెలిపారు.