17 March, 2026 | 11:48 PM

భగత్ సింగ్ స్మారక యువజనోత్సవాలకు పిలుపు

17-03-2026 10:13 PM

మొయినాబాద్‌లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

మొయినాబాద్,(విజయక్రాంతి): విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న భగత్ సింగ్ స్మారక యువజనోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి చరణ్ గౌడ్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, దేశ స్వాతంత్య్ర సమరంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచిన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం, లౌకికత్వం, సమానత్వం కోసం పోరాడిన భగత్ సింగ్ త్యాగం భారత యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, విద్యా రంగంపై దాడులు, ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భగత్ సింగ్ ఆలోచనలు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయని తెలిపారు.

అలాగే సమాజాన్ని ప్రభావితం చేస్తున్న డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్స్ వంటి వ్యసనాలకు వ్యతిరేకంగా యువత, విద్యార్థులు చైతన్యవంతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చా వేదికలు, యువజన ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ సహాయ కార్యదర్శులు మాల చందు, ఇతర నాయకులు చరణ్, నితీష్, అరుణ్, రోషన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.