రక్తపాతాన్ని కోరుకుంటున్న సీఎం రేవంత్
- ప్రజలకు, రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
- వైఫల్యాల డైవర్షన్‌కే ‘కాళేశ్వరం’ డ్రామాలు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): మీడియా సమావేశంలో అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆరు హత్యలు చేసిన షాబాద్ దైవాలగూడ హంతకుడికి తేడా ఏమీ లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఇంతటి నీచమైన, హింసాత్మకమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేసినందుకు ప్రజలకు, రైతులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ఆయన శనివారం స్పందిస్తూ... ఎప్పుడెప్పుడు ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, చేతగానితనం ప్రజల ముందుకు వస్తాయో.. అప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి డైవర్షన్ డ్రామాలు తెరపైకి రావడం పరిపాటిగా మారిందన్నారు. ఒక పోక్సో నిందితుడికి కనీసం పదేళ్ల జైలు శిక్ష పడేలా కఠినమైన సెక్షన్లు నమోదు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.
ఘోరాలకు పాల్పడిన హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతున్నా ఇప్పటికీ పట్టుకోలేకపో వడం హోంశాఖ చేతగాని తనానికి పరాకాష్ట అన్నారు. ఈ శాంతిభద్రతల వైఫల్యం నుంచి, ప్రజల తీవ్ర ఆగ్రహం నుంచి తప్పించుకోవడా నికే రేవంత్ సర్కార్ మళ్లీ అదే కాళేశ్వరం, మేడిగడ్డ, ఎన్డీఎస్‌ఏ పాట పాడుతున్నారని విమర్శించారు. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి, గోదావరి జలాలను ఎత్తిపోసి పంటలను కాపాడాలని రిటైర్డ్ ఇంజనీర్లు, బీఆర్‌ఎస్ తపన పడుతుంటే..
సీఎం మాత్రం తన క్షుద్ర రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, రైతుల పొలాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు. నిద్రపోయే వాడిని లేపవచ్చు కానీ, నిద్ర నటిస్తున్న వాడిని లేపలేమని తెలిపారు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే కనీస ఆలోచన, తపన రేవంత్‌రెడ్డికి ఏమాత్రం లేదని ఈరోజు మీడియా సమావేశంతో స్పష్టంగా తేలిపోయిందని అన్నారు.
నీళ్లు అడిగితే రక్తం చల్లాలన్న ఈ అహంకారపు, దుర్మార్గపు వైఖరిని తెలంగాణ రైతాంగం గమనిస్తోందని తెలిపారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ఆడుతున్న ఈ డైవర్షన్ నాటకాలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ చేతకాని ప్రభుత్వానికి, తెలంగాణ రైతులు, ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
కేసీఆర్‌ను విమర్శించే వాళ్లకు ఆర్బీఐ లెక్కలే చెంపపెట్టు
తెలంగాణకు కేసీఆర్ ఏం చేసిండు? అని విమర్శించే వాళ్లకు ఆర్బీఐ లెక్కలే చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆర్బీఐ హ్యాండ్ బుక్ దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధిపై ఇచ్చిన నివేదికపై శనివారం ట్విట్టర్ వేదికగా హరీశ్ రావు స్పందించారు. దేశ వ్యవసాయ వృద్ధిలో తెలంగాణదే ఫస్ట్ ప్లేస్ ఉందని, 6.9 శాతం సగటు వృద్ధితో టాప్ అని తెలిపారు. తమిళనాడు, అస్సాం లాంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు.
కాళేశ్వరం, 24 గంటల ఉచిత కరెంట్, పక్కా ప్రణాళికతోనే కేసీఆర్ వ్యవసాయ విప్లవం సాధ్యమైందని గుర్తు చేశారు. కానీ.. కాంగ్రెస్ వచ్చిన ఈ రెండున్నరేళ్లలోనే తెలంగాణ వ్యవసాయ వ్యవస్థ కుప్పకూలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు, వడ్లు కొనే దిక్కులేక రైతాంగం మళ్లీ ఆగమాగమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేండ్లు కష్టపడి నిర్మించిన వ్యవసాయ వ్యవస్థను.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుప్పకూలిందని మండిపడ్డారు.






