29-07-2025 02:35:26 AM
మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): బీసీలపై సీఎం రేవంత్ రెడ్డిది కపట ప్రేమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ బిల్లుల ఆమోదానికి సీఎం, మంత్రులు ఢిల్లీకి వెళ్లి పాస్ అయ్యాకే హైదరాబాద్‌కు తిరిగి రావాలని, అక్కడికి అఖిలపక్షాన్ని తీసుకువెళ్తే తమ పార్టీ వస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేతిలో మరోసారి మోసపోవడానికి బీసీలకు సిద్ధంగా లేరని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్‌కు మోక్షం లభించలేదన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్, బీజేపీలది వగల ప్రేమే అని తెలిపోయిందని మండిపడ్డా రు.
ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపి బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందని, బీజేపీ పాలి త రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో లేని అంశమని, ఎవరైనా ఇక్కడ పెంచితే జైలుకు వెళ్లడం ఖాయమని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా చెప్పారని, రాష్ట్ర పరిధి కానప్పుడు ఆర్డినెన్స్‌ను గవర్నర్ దగ్గరికి ఎందుకు పంపారన్నారు.