calender_icon.png 29 July, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల సాంస్కృతిక ఉద్యమం బలోపేతం

29-07-2025 02:34:21 AM

  1. రాజ్యాధికారం కోసం కవులు, కళాకారులు ఒక్కటి కావాలే

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

ఖైరతాబాద్, జూలై 28: బీసీల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేసి, బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కళాకారుల ఆత్మీయ కలయిక పేరుతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ కవులు, కళాకారులు తరలివచ్చి బీసీ కల్చరల్ ఫోరంను ఏర్పాటు చేశారు.

మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్, మహాత్మా జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం వరకు కవులు, కళాకారులు, రచయితలు, సాంస్కృతిక సేనగా ఏర్పడి ఉద్యమిస్తేనే ఉద్యమాలు విజయం సాధించాయని తెలిపారు.

బీసీల రాజకీయ పోరాటానికి సాంస్కృతిక ఉద్యమం తోడు అయితే వచ్చేది బీసీల రాజ్యమేనని తెలిపారు. బీసీ కళాకారులు, కవులు ఇప్పటివరకు తెలంగాణలో సామాజిక దోపిడీ, అసమానతలు, ప్రాంతీయ వివక్షతపై తమ కలం, గళం ద్వారా ప్రజలలో సామాజిక రాజకీయ చైతన్యం కలిగించి స్వరాష్ట్ర సాధనకు తోడ్పడ్డారని తెలిపారు. బీసీ కళాకారులంతా ఏకతాటి పైకి వచ్చి పార్టీలకతీతంగా బీసీ రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. బీసీ కళాకారులు ఏకతాటి పైకి రావడం అభినందనీయమని అన్నారు. 

కల్చరల్ ఫోరం కార్యవర్గం 

బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గాన్ని జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వరంగల్ శ్రీనివాస్, దరువు అంజన్న, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కోదారి శీను, ఉపాధ్యక్షులుగా అభినయ శ్రీనివాస్, అంబటి వెంకన్న, కోశాధికారిగా బీసీ రామలింగంతోపాటు సంయుక్త కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, సాంస్కృతిక కార్యదర్శులను ప్రకటించారు.  ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, శేఖర్ సగర, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విక్రమ్‌గౌడ్, శ్యాం కుర్మా, తారకేశ్వరి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.