పక్క జిల్లాలకు నీళ్లు... కరీంనగర్ ప్రజలకు కన్నీళ్లు
సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
ముకరంపుర, జూన్ 25(విజయక్రాంతి): కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్(Karimnagar Lower Manair Dam)లో ఉన్న నీటిని ప్రక్క జిల్లాలకు తరలించి కరీంనగర్ ప్రజలు త్రాగునీటికి కన్నీళ్లను చవిచూడాల్సివచ్చిందని కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాల్లోని చెరువులు,కుంటలు కబ్జాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆరోపించారు. నగరంలో త్రాగునీటి ఎద్దడిని నివారించాలని,విలీన గ్రామాల కుంటలు,చెరువులను కాపాడాలని గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం(Municipal Corporation office) ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
త్రాగునీటి కష్టాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఖాళీ బిందెలతో నిరసన తెలపడానికి సిపిఐ నాయకులు,కార్యకర్తలు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.నాయకులకు పోలీసులకు కొద్దిసేపు తోపులాట జరిగింది.అనంతరం సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, తదితరులు పాల్గొన్నారు






