01-12-2025 05:29:30 PM
హైదరాబాద్: ఈసారి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లు నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని, ఈ ప్రాజెక్టుపై కొందరూ కేసులు వేసి అడ్డుకున్నారని సీఎం విరుచుకుపడ్డారు. రైతులు నష్టపోవద్దని ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చామన్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణానది పారుతున్నా.. ఇక్కడి నేలకు నీళ్లు అందలేదని ఆయన మండిపడ్డారు. మాయగాళ్ల మాటలు విని ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని, ఎంత డబ్బు ఖర్చయినా సరే మక్తల్-నారాయణపేట ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.
ఇరిగేషన్, ఎడ్యుకేషన్ ను ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నామని, వలసలు పోవడం వల్ల పాలమూరు జిల్లా బిడ్డలు విద్యకు దూరమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజురు చేశామని, ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఐఐటీ మంజూరు చేసుకున్నామన్నారు. పాలమూరు యూనివర్సిటీకి అడిగిన కోర్సులన్ని మంజూరు చేశామని, ఒకప్పుడు మహిళలు ఎక్కడికి వెళ్లాలన్ని ఛార్జీలకు ఇబ్బంది పడేవారని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఛార్జీ డబ్బులు కోసం భర్త మీద, పిల్లల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరుగుతుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకునేవాళ్లని సీఎం వెల్లడించారు. మహిళలు బస్సుల్లో ఉచితంగా తిరగటమే కాదు.. బస్సులకు యజమానులు అయ్యారని, పొదుపు సంఘాల మహిళలు పెట్రోలు బంక్ లకు యజమానులు అయ్యారని గుర్తుచేశారు. ధనవంతులు తిన్నట్టే పేదలు కూడా సన్నబియ్యం తినాలని భావించామని, హైటెక్ సిటీలో 150 క్యాంటిన్లను మహిళా సంఘాలకు కేటాయించామని రేంత్ రెడ్డి తెలిపారు.
పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, 35 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఏస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీసీలు ఎంతమంది ఉన్నారో వందేళ్లుగా లెక్కలేదని, సామాజిక కుల సర్వే చేసి అన్ని కులాల లెక్కలు తీసుకున్నామని తెలిపారు. కేసీఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి పోయారని, ఓ వైపు ఆ అప్పు తీరుస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను స్థానిక సంస్థల ఎన్నకల్లో గెలిపించవద్దని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్లను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందదన్నారు. మంత్రుల వద్దకు వెళ్లి గ్రామానికి నిధులు అడిగే నేతలను సర్పంచ్ లుగా ఎన్నుకోవాలని సీఎం సూచించారు.