02-12-2025 06:05:27 PM
హైదరాబాద్: కొత్తగూడెంలో మంగళవారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ విజయోత్సవాల సందర్భంగా కొత్తగూడెంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరుతో నిర్మించిన ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. వర్సిటీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ప్రజాపాలనలో భాగంగా ఎర్త్ వర్సిటీని ప్రారంభించుకున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడింది పాల్వంచలోనే అని గుర్తు చేసుకున్నారు.
60 ఏళ్ల స్వరాష్ట్ర కలను తీర్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అని, ఎర్త్ వర్సిటీకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరును పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైన చోటే తెలంగాణ ఇచ్చిన ప్రధాని పేరు పెట్టుకున్నామని, దేశంలో ప్రధాన ప్రాజెక్టులను నిర్మాణం చేసింది నెహ్రూ అని సీఎం తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలు పారే అరుదైన ప్రాంతం ఉమ్మడి ఖమ్మం అని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ ఏది అడిగినా ఇచ్చేస్తున్నారన్నారు.
విద్యలో ఖమ్మం జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రాష్ట్రం ప్రజలకు ఏం ఇచ్చినా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించుకున్నట్లు రేవంత్ రెడ్డ తెలిపారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపే బాధ్యత నాది అని సీఎం హామీ ఇచ్చారు. పథకాలు అందాలంటే సర్పంచ్ లు మంచివాళ్లు ఉండాలని, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారినే గెలిపించండని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటీ శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు.