ఆటల కోసం తెలంగాణ ముందడుగు
హైదరాబాద్: గత 20 ఏళ్లలో తెలంగాణలో ఎలాంటి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. హైదరాబాద్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పీటీ ఉషతో కలిసి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీని ప్రారంభించారు. స్పోర్ట్స్ వర్సిటీ వెబ్ సైట్, లోగోను సీఎం ఆవిష్కరించారు. 8వ ఖేలో ఇండియన్ గేమ్స్ కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. 2034 లో భారత్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనుంది.. దానికి హైదరాబాద్ వేదిక కావాలని కోరుకుంటున్నానని సీఎం రేవంత్ తెలిపారు.
ఆటల కోసం తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందని సూచించారు. మహాత్మ గాంధీ నుంచి యంగ్ ఇండియా(Young India) స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. మహాత్మ గాంధీ యంగ్ ఇండియా అనే వార్త పత్రికను నడిపేవారని వెల్లడించారు. 1990-2004 మధ్య హైదరాబాద్ చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ కు ఆతిథ్య ఇచ్చిందని వివరించారు. ఒలింపిక్స్ పతకాల్లో భారత్ ఎప్పుడూ చివరనే ఉంటుందని తెలిపారు. కొంతమంది ఒలింపిక్స్, ఇతర గేమ్స్ లో రాణించినా దేశానికి సరైన గుర్తింపు రావట్లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలే స్పోర్ట్స్ లో దేశ దుస్థితికి కారణమని ఆరోపించారు. క్రీడాకారులను సరైన దిశలో నడిపించడానికి స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడానికే స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని సూచించారు.






