9 June, 2026 | 2:39 AM

సీఎం రేవంత్‌రెడ్డి ఓ తాలిబాన్

09-06-2026 01:52 AM

ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామంటున్నడు

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువని.. ఆడ పిల్లలు, పేదలకు చదువును దూరం చేస్తున్న ఆయన తాలిబాన్ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె ఫైర్ అయ్యారు.

తాలిబాన్‌లు ఆడబిడ్డలకు చదువు దూరం చేశారని.. అదే తరహాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్లను మూసేసి ఆడపిల్లలు, పేదలకు చదువులు అందకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. 27 వేల స్కూళ్లలో పని చేస్తున్న 3 లక్షలకు పైగా ప్రభుత్వ టీచర్లను ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. క్రమేణ విద్యను పేదలకు దూరం చేసి ప్రైవేటీకరించడానికి సీఎం తెర తీస్తున్నారని ఆరోపించారు.

విద్యాశాఖపై రేవంత్ రెడ్డి పట్టు కోల్పోయారని, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు కొని హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు అన్నింటా వైఫల్యాలేనని ఎద్దేవా చేశారు.   రూ.11 వేల కోట్ల ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెప్పి జీవో 7 పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారని, ఈ జీవో కారణంగా విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు దోపిడీ చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీవో నెంబర్ 7 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే అమల్లోకి తెచ్చి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.