20-08-2025 01:49:49 PM
హైదరాబాద్: గచ్చిబౌలిలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల(Integrated Sub Registrar Office) శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... 1994 నుంచి 2014 వరకు హైదరాబాద్ ను అప్పటి ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారని తెలిపారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సరైన సౌకర్యాలు లేవని తెలిపారు. అన్ని సౌకర్యాలతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పిస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) పాత్ర ఉందని పేర్కొన్నారు. గూగుల్ లాంటి ప్రముఖ సంస్థల్లో తెలుగువారు పెద్ద పదవుల్లో ఉన్నారని సూచించారు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఇక్కడి నుంచే పని చేస్తున్నాయని తెలిపారు. మన ప్రాంత విద్యార్థులు ఇక్కడే చదువుకోవాలని పలు సంస్థలు నిర్మించారని తెలిపారు. రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) వల్లే ఐటీ రంగంలో చాలా మంది రాణిస్తున్నారని, అమెరికాలో మన ఐటీ నిపుణులు పనిచేయడం ఆపేస్తే స్తంభించి పోతుందని వివరించారు. హైటెక్ సిటీ(Hi-tech City) కట్టినప్పుడు అవహేళన చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరం న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో పోటీ పడుతోందన్నారు. మన వద్ద అన్ని ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయడం కావాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలతో కూడిన ఉద్యోగ భద్రత ఇచ్చామన్న సీఎం రేవంత్(Revanth Reddy) రాబోయే పదేళ్లలో వన్ బిలియన్ డాలర్ల ఎకనామీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మూసీ నది ప్రక్షాళన(Musi River) ఎందుకు అడ్డుకుంటున్నారు?, మూసీ మురికిలో బ్రతకాలని పేదలు ఎందుకు అనుకుంటున్నారు? అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ రైజింగ్ 2047 తో అభివృద్ధి చేసుకొందామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మూసీ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ప్రభుత్వం సంకల్పిస్తుందన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీ రావాలని ప్రభుత్వం కోరుకుంటుందని పేర్కొన్నారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన జరగాలని వెల్లడించారు.