17-01-2026 04:15:14 PM
కాంగ్రెస్ ప్రాజెక్టులే జీవనాధారం.
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా జడ్చర్ల మండలం చిట్టబోయిన్ పల్లిలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి భూమి పూజ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులతో సీఎం, మంత్రులు ముఖాముఖి నిర్వహించారు. అనంతరం జడ్చర్లలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ... బూర్గుల రామకృష్ణారావు తర్వాత మహబూబ్ నగర్ జిల్లా బిడ్డకు సీఎం పదవి దక్కిందని తెలిపారు. తొలి ప్రధాని నెహ్రూ.. సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులే ఇప్పటికీ మను జీవనాధారం అన్నారు. నేను కూడా సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలకే ప్రాధాన్యత ఇస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.
పేదలకు ఇచ్చేందుకు భూమి లేదు.
గతంలో భూస్వాములు, దొరల వద్ద లక్షలాది ఎకరాలు ఉండేదని సీఎం చెప్పారు. పీవీ నరసింహరావు ప్రభుత్వం భూగరిష్ఠ పరిమితి చట్టం తెచ్చిందని తెలిపారు. భూగరిష్ఠ పరిమితి చట్టం తెచ్చి మిగులు భూములను పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం పంచిందని వెల్లడించారు. ఇప్పుడు పేదలకు భూమి పంచేందుకు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద భూమి లేదని పేర్కొన్నారు. సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన వారికి ప్రభుత్వం రూ. లక్ష ఆర్థికసాయం చేస్తోందని సీఎం వివరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేయగలిగింది మంచి విద్య ఇవ్వటమేనని స్పష్టం చేశారు.