17-01-2026 04:12:59 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు కోసం శనివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీకి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. కాగా ఉదయం నుండే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అక్రమ అరెస్టులు చేశారు.
దీంతో యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ నల్ల దుస్తులు ధరించి నల్ల బెలూన్ లతో సికింద్రాబాద్ బచావ్ నినాదాలతో నిరసన తెలుపుతూ MG రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామన్నా అక్రమంగా అరెస్ట్ లు చేసి,144 సెక్షన్, కర్ఫ్యూ అమలులో ఉందా అన్నట్లు వేలాదిమంది పోలీసులు వచ్చి ర్యాలీని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. జంటనగరాలు అంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్ లు గుర్తింపు ఉందని, అలాంటి సికింద్రాబాద్ చరిత్ర, అస్తిత్వం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.
తమ అస్తిత్వం కోసం పోరాడుతుంటే అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. ఈ నెల 5 వ తేదీన ర్యాలీ కి అనుమతి కోరితే ఉద్దేశ పూర్వకంగా శుక్రవారం రాత్రి అనుమతిని రిజెక్ట్ చేశారని చెప్పారు. ర్యాలీకి అనుమతి లేకుంటే ర్యాలీకి ముందురోజు పోలీసు అధికారులు తాము చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించరు కదా అని ప్రశ్నించారు. అరెస్ట్ లతో తమ ఉద్యమం ఆగదని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని, రెట్టింపు ఉత్సాహంతో ఫిబ్రవరి మొదటి వారంలో పెద్ద ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.