15 May, 2026 | 6:25 AM

నిరుద్యోగులు చెప్పింది వినడానికి మేం సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

26-08-2024 05:22 PM

వర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను నియమిస్తాం

నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు

హైదరాబాద్: సహేతుకమైన కారణాలు చెబితే నిరుద్యోగులు చెప్పింది వినడానికి తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... విద్యార్థుల ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అయిందని తెలిపారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కృషి చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 90 రోజుల్లో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం, మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నామని చెప్పారు. సచివాలయంలోకి ఎవరూ రాకుండా గతంలో పోలీసు పహారా ఉండేదన్నారు. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని సీఎం పిలుపునిచ్చారు. నైపుణ్యాలు లేకపోవడం వల్ల నిరుద్యోగం పట్టిపీడిస్తోందని ఆయన పేర్కొన్నారు.

చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి యంగ్ ఇండియా వర్సిటీలో ఏటా 20 వేల మందికి శిక్షణ ఇస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం పేర్కొన్నారు. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పథకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. 20 నుంచి 30 ఎకరాల్లో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. 

100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ గత ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 10,15 రోజుల్లో అన్ని వర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను నియమిస్తామని సీఎం తెలిపారు. వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు.. నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ అర్హత పరీక్షలను వాయిదా వేస్తే నిరుద్యోగులకే నష్టం అన్నారు. సహేతుకమైన కారణాలు చెబితే నిరుద్యోగులు చెప్పింది వినడానికి తాము సిద్ధమని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘురాం రెడ్డి, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం, ఇతర అధికారులు పాల్గొన్నారు.