20-01-2026 02:06:33 AM
అంతకు ముందే స్విట్జర్లాండ్‌కు వెళ్లిన మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృ త్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరింది. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ( డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనడానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అధికారుల సోమవారం శంషాబాద్ ఏయిర్‌పోర్టు నుంచి వెళ్లారు.
మేడారం నుంచి నేరుగా శంషాబాద్ కు వచ్చిన సీఎం.. అక్కడి నుంచి దావోస్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటికే స్విట్జర్లాండ్‌కు వెళ్లారు. ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబ డులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. దావోస్‌లో జరిగే సదస్సులో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఉద్దేశాలు, లక్ష్యాలపై వివరించనున్నారు.
తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ, తెలంగాణ ఏఐ హబ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సదస్సులో ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ దార్శనికత, రాష్ట్రాభివృద్దికి క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో రూపొందించిన ప్రణాళికలు, రా ష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను దావోస్ పర్యటనలో రాష్ట్ర బృందం వివరించనుంది.
ఇక జీఎస్డీపీ వృద్ధికి అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాలు, 2047 నాటికి సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికలను పెట్టుబడిదారుల సమక్షంలో ఆవిష్క రించనుంది. పెట్టుబడుల ఒప్పందాలు, భాగస్వామ్యాలు, భవిష్యత్ ఆర్థిక వ్యూహాలపై ఇక్కడ చర్చలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం రెండు పర్యటనల్లో ఈ వేదికను సమర్థవంతంగా వినియోగించుకుని రా ష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా నిలబెట్టింది. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో మూడో పర్యటనను మరింత వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది.
ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఏఐ నుం చి గ్రీన్ ఎనర్జీ వరకు బహుముఖ ఎజెండాతో సాధారణ ప్రెజెంటేషన్‌తో కాకుండా రంగాలవారీగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లేందుకు ప్రిపేర్ అయ్యింది. దావో స్ సదస్సు నేపథ్యంలో రాష్ట్రంలోని రేవంత్ సర్కారు ప్రధానంగా నాలుగు కీలక రంగాలపై ఫోకస్ పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) రంగంలో, సెమీకండక్టర్- ఎలక్ట్రానిక్స్ రంగంలో, గ్రీన్ ఎనర్జీ అండ్ ఈవీ రంగంలో, స్టార్టప్ ఎకో సిస్టమ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దావోస్ పర్యటనకు వెళ్లింది.
సీఎం ఆధ్వర్యంలో హై ప్రొఫైల్ మీటింగ్స్
అంతర్జాతీయ స్థాయిలో కంపెనీల దృష్టిని తెలంగాణ వైపు మరల్చేలా ప్రభుత్వం దావోస్ వేదికగా చర్యలు తీసుకోనుంది. ఇందుకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. తెలంగాణ గేట్వే టూ ఇండియాస్ ఫ్యూచర్ ఎకానమీ అంశాన్ని థీమ్గా ఎంచుకున్నది. ఈ ప్రెజెంటేషన్లో హైదరాబాద్ ఐటీ విజయగాథ, ఫార్మా క్యాపిటల్గా రాష్ట్ర స్థానం, మౌలిక సదుపాయాల పురోగతి, పరిశ్రమలకు సులభమైన అనుమతులు, పెట్టుబడిదారులకు పారదర్శక విధానాలను అందించడంపై వివరించనున్నారు.
సీఎం నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం దావోస్‌లో వరుసగా గ్లోబల్ సీఈవోలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ముఖాముఖి భేటీలు నిర్వహించనుంది. దావోస్ పర్యటన ద్వారా భారీ విదేశీ పెట్టుబడులు, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన, వేలాది ఉద్యోగాల ఏర్పాటు, ఎగుమతుల పెరుగుదల, టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వృద్ధి జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. మరోవైపు.. దావోస్ పర్యటనను భవిష్యత్ ఆర్థిక వ్యూహానికి కీలకంగా భావిస్తోంది. మొత్తానికి సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో మరోసారి తెలంగాణ సత్తా చాటేలా దావోస్ పర్యటనను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో వెళ్లారు.