calender_icon.png 6 February, 2026 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్ళను కాపాడుతుంది కిషన్ రెడ్డినే

06-02-2026 06:31:19 PM

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం పర్యటించారు. జిల్లాలోని బర్ధిపూర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతున్నామని, నిజామాబాద్ జిల్లా గొప్ప నాయకులను రాష్ట్రానికి అందించిందని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వాలని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ మురికి కూపంగా మారిందని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా నిజామాబాద్ కు ఏం చేయలేదని, ఈ జిల్లాల్లోని రైతులు పండించిన పసుపు బంగారంతో పోటి పడేదన్నారు.

 నిజామాబాద్ లోని వ్యవసాయం తెలంగాణకే కాదు.. దేశానికే ఆదర్శమని, ఇక్కడి రైతులు చేస్తున్న పసుపు బోర్డు పోరాటం దేశానికే ఆదర్శమని రేవంత్ రెడ్డి చెప్పారు. 2028తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రెండోవసారి అధికారంలోకి తీసుకువస్తామని, జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి అదనపు నిధులు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని సీఎం తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో నిజామాబాద్ లో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర పరపతి ఉంటే నిజామాబాద్ ను ఎందుకు స్మార్ట్ సిటీగా ప్రకటించలేదని, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నేతలు నిధులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

నిజామాబాద్ కు ఏం తెచ్చారని ధర్మపురి అరవింద్ ను అడుగుతున్నా..?, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ చెప్పిందన్నారు. వారు చెప్పినట్లే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాం.. ఏమైంది..?, కేసీఆర్, కేటీఆర్ ను ఎప్పుడు అరెస్టు చేస్తారని బీజేపీని అడుగుతున్నా..? అని సీఎం అన్నారు. ఎప్పుడో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి.. మీరు కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి..? అని ప్రశ్నించారు. బీజేపీలో ధర్మపురి అర్వింద్ కు పరపతి లేదు, కేసీఆర్, కేటీఆర్ ను కిషన్ రెడ్డి కాపాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.