calender_icon.png 10 December, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాది ధైర్యం కాదు.. అభిమానం

10-12-2025 02:19:40 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రెండోసారి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని బుధవారం సందర్శించారు. రూ.వెయ్యి కోట్ల నిధుల జీవోను విద్యార్థులకు సీఎం అంకితం చేశారు. అంతేకాకుండా ఓయూ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు రూ.45 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఓయూకు వెళ్తా అన్నప్పుడు చాలా ధైర్యం చేస్తున్నారని కొందరు తనతో అన్నారు. ఓయూలో ప్రజాప్రతినిధులను అడ్డుకున్న చరిత్ర ఉందని చెప్పారని, నాది ధైర్యం కాదు.. అభిమానం అని వారితో చెప్పినట్లు సీఎం తెలిపారు.

గుండెల నిండా అభిమానం నింపుకుని ఓయూకు వచ్చా అని, ముఖ్యమంత్రిగా తనకు చాలా సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎక్కడేం మాట్లాడాలో అధికారులే రాసిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారులు ఇచ్చింది మాట్లాడితే ఓయూకు వెళ్లడం దండగ అని, ఓయూని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే సంకల్పంతో వచ్చానన్నారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణలో పోరాటం సహజమని, తెలంగాణ చదువు లేకున్నా ఆధిపత్యాన్ని సహించరు. నిజాం, రజాకార్లు ఆరాచకాలకు వ్యతిరేకంగా సాయుధం పోరాటం జరిగిందని, సామాన్యులైన చాకలి ఐలమ్మ, దొడ్డ కొమురయ్య దొరలపై పోరాడారని  గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగకపోతే తెలంగాణ ఉద్యమం వచ్చిందని,  ఉద్యమన్ని ఉస్మానియా నుంచే విద్యార్థులు ప్రారంభించినట్లు తెలిపారు. ఓయూ నుంచే ఎందరో విద్యార్థులు నక్సలిజం వైపు వెళ్లారని, జార్జిరెడ్డి, గద్దర్ వంటి వీరులను తెలంగాణకు అందించిందన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఓయూ కీలక పాత్ర పోషించిందని, బడికే వెళ్లని అందెశ్రీ  ప్రతి బడిలో పాడుకునే రాష్ట్రం గీతం అందించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ వస్తే స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు వస్తాయని ఓయూ విద్యార్థులు భావించారని, 108 ఏళ్ల చరిత్ర ఉన్న ఓయూను చరిత్రలో కలపాలని కొందరు యత్నించారని ఆగ్రహించారు. తను గంటూరులో చదువుకోలేదు.. గూడుపుఠాణీలు చేయలేదు.. నల్లమల అటవీ ప్రాంతంలో దళిత, బహుజన వర్గాలతో కలిసి పెరిగినవాడిని అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.