calender_icon.png 10 December, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహేతర సంబంధం కోసం భర్త హత్య

10-12-2025 01:09:21 PM

కూతురు సాక్ష్యంతో తల్లికి యావజ్జీవం

మరో నలుగురికి కూడా అదే శిక్ష

గద్వాల జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు

గద్వాల: ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చిన కేసులో భార్యతో పాటు మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. 2019లో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి విచారణ పూర్తయ్యాక మంగళవారం తీర్పు వెలువడింది. 12 ఏళ్ల కూతురు ఇచ్చిన కీలక సాక్ష్యం ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించింది. జిల్లా ప్రధాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోదాచారి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పవిత్ర బంధాలను విస్మరించి...

చాకలి కృష్ణవేణి–షాలు దంపతులు అలంపూర్ పట్టణానికి చెందినవారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. షాలు ప్రైవేట్ డ్రైవర్‌గా, కృష్ణవేణి ఒక ప్రైవేట్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తూ ఉండేది. ఆ సమయంలో కృష్ణవేణికి లింగన్వాయి గ్రామానికి చెందిన సంకటి మహేష్‌తో పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. సంకటి మహేష్ వివాహితుడు, పిల్లల తండ్రి. ఈ ఇద్దరు తమ తమ కుటుంబాలను పట్టించుకోకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగించారు.ఈ విషయం గమనించిన భర్త షాలు, భార్య కృష్ణవేణికి పద్ధతి మార్చుకోవాలని సూచించినా, ఆమెలో మార్పు రాలేదు.

అడ్డు తొలగించుకోవాలనే ఆలోచన

కృష్ణవేణి తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించడానికి చివరకు ప్రియుడు మహేష్‌తో కలసి భర్త షాలును ‘అడ్డు’గా భావించి హత్యకు కుట్ర పన్నారు. కర్నూలుకు చెందిన ఆటో డ్రైవర్ దడపోగు మహేష్, పెయింటర్ ఈడిగ మహేందర్, నారాయణపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ తంబలి కార్తీక్, కొలగట్ల గ్రామానికి చెందిన ఉల్చా రాజు అలియాస్ సూరిలకు సుపారి ఇచ్చి హత్య పథకం రూపొందించారు. 

భర్తను నమ్మించి బయటకు తీసుకెళ్లి

2019 జూన్ 3న జ్వరంతో ఉన్న కూతురును కర్నూలు డాక్టర్ వద్దకు తీసుకెళుదామని కృష్ణవేణి షాలును నమ్మించింది. దీంతో షాలు, భార్య, 12 ఏళ్ల కూతురు, 4 ఏళ్ల కుమారుడితో కలిసి బైక్‌పై కర్నూలుకు వెళ్లి డాక్టర్‌కి చూపించాడు. తిరుగు ప్రయాణంలో కృష్ణవేణి తన ప్రియుడు మహేష్‌తో కాల్ ద్వారా నిరంతరం సమాచారాన్ని పంచుకుంటూ వచ్చింది. రాత్రి 10 గంటల సమయంలో ఇమాంపూర్ స్టేజ్ సమీపంలో సూపారి గ్యాంగ్ సభ్యులు షాలును అడ్డుకుంది. బైక్‌పై నుంచి షాలును కిందికి లాగి బీరు సీసాలతో దారుణంగా దాడి చేశారు. అనంతరం పక్కనే ఉన్న పొలాల్లోకి ఈడ్చుకొని వెళ్లి  హత్య చేశారు.

దుండగుల దాడిలా నమ్మించే...

హత్య అనంతరం కృష్ణవేణి దీనిని గుర్తు తెలియని దుండగుల దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులు కూడా ఆమె చెప్పిన మాటలనే నమ్మి ఫిర్యాదు చేశారు. ఎస్సై మధుసూదన్ రెడ్డి కేసు నామోదు చేయగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్  జి.రాజు విచారణ పూర్తిచేసారు. ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ మొగులయ్య, సీఐ రవికుమార్ల ఈ కేసును పర్యవేక్షించారు.

పోలీసులకు కృష్ణవేణిపై అనుమానం రావడంతో కాల్ డేటా పరిశీలించగా, హత్య జరిగిన రోజున సంకటి మహేష్‌తో ఆమె పలుమార్లు మాట్లాడినట్లు బయటపడింది. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది.

కూతురు సాక్ష్యం.. కేసులో కీలకం 

ఈ కేసులో ప్రాసిక్యూషన్ 17 మంది సాక్షులను ప్రవేశపెట్టింది. బలమైన టెక్నికల్ ఎవిడెన్స్‌ను కూడా జోడించారు. ఎస్సై జిక్కి బాబు, లైసెన్సింగ్ ఆఫీసర్ ప్రసాద్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ మహబూబ్ కేసు పురోగతికి తమ వంతుగా సహకరించారు. ముఖ్యంగా 12 ఏళ్ల కూతురు ప్రత్యక్షంగా చూసిన సంఘటనలను కోర్టులో ధైర్యంగా చెప్పడం కేసులో కీలక పాత్ర పోషించింది.

అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకొని  జిల్లా ప్రధాన న్యాయమూర్తి  ఎన్. ప్రేమలత తీర్పు వెలువరించారు. కృష్ణవేణి, సంకటి మహేష్‌తో పాటు సూపారి గ్యాంగ్ సభ్యులు దడపోగు మహేష్, ఈడిగ మహేందర్, ఉల్చా రాజులకు యావజ్జీవ శిక్ష విధించారు. ఈ కేసులో ఐదవ నిందితుడు తంబలి కార్తీక్‌పై నేరం రుజువు కానందున నిర్దోషిగా విడుదల చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోదాచారి తెలిపారు.