వచ్చేవారం మేడిగడ్డకు సీఎం రేవంత్!
మేడిగడ్డకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
బరాజ్‌లపై సమీక్షలో అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): వచ్చేవారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బరాజ్‌లను సందర్శించనున్నట్లు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ సహా ఇతర ఆనకట్టల అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులతో గురువారం సమీక్ష సమావేశాన్ని ఆయన కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సమావేశంలో మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి చేపట్టవల్సిన తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. మేడిగడ్డ ఆనకట్టకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. అందుకు రక్షణ చర్యలు, పరీక్షల్లో వేగం పెంచాలని సూచించారు. ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీ) నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.






