అసత్య ప్రచారం చేయొద్దు
రైతుల మనోస్థుర్యైం దెబ్బతింటోంది
ధాన్యం కొనుగోళ్ళపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లు జరగట్లేదని చేస్తోన్న అసత్య ప్రచారాలతో రైతులు ఎవరూ ముందుకురావడం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారాలతో రైతుల మనోస్థుర్యైం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ళపై రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్యాచరణ రూపొందించామని తెలిపారు. గతంలో ఏప్రిల్ మొదటి వారం తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవగా ఈసారి మార్చి 25 లోపే ప్రారంభించామన్నారు.
రాష్ట్రంలో 7,421 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 83 శాతం ధాన్యానికి చెల్లింపులు చేసినట్లు చెప్పారు. ఒక్క రోజే 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, మార్కెట్‌కు వస్తున్న రైతులతో తానే స్వయంగా మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఖాతాల్లో నగదు జమపై రైతులు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఒకటి రెండు చోట్ల ఏవైనా పొరపాట్లు జరిగి ఉండవచ్చని, వాటిని కూడా వెంటనే సరిదిద్దుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. తొలి త్రైమాసికంలోనే పౌరసరఫరాల శాఖలో రూ.6వేల కోట్ల అప్పు తీర్చామన్నారు. తెలంగాణ బియ్యానికి ఒక బ్రాండ్ ఉందని, దాన్ని నిలబెట్టుకోవాలన్నారు.






