కేరళంలో సీఎం రేవంత్‌వి.. మాయ మాటలే
- రాష్ట్రంలో ఇచ్చిన హామీలనే ఎగ్గొట్టారు
- పొలిటికల్ టూరిస్టుల కల్లబొల్లి కబుర్లు.. వారి వలలో పడొద్దు
- కేరళం ప్రజలను కోరిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేయకున్నా, చేశామని సీఎం రేవంత్‌రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్తున్నారని.. కేరళంలో ఆయన మాటలను ఎవరూ వినరని, ఆయన ఉపన్యాసాలతో ఓట్లు పడవని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేరళం ప్రజలు చాలా తెలివైనవారు, రానున్న ఎన్నికల్లో వారు అత్యంత జాగ్రత్తగా ఆలోచించి ఓటేస్తారన్న నమ్మకం తమకుందన్నారు.
అయితే కొందరు పొలిటికల్ టూరిస్టులు కేరళంలో కల్లబొల్లి మాటలతో ప్రజల్ని మాయచేయాలని చూస్తున్నారని, వారి వలలో పడొద్దని ఆయన కోరారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి కేరళం ప్రజలకు బహిరంగ లేఖ రాసారు. ఈ సందర్భంగా శుక్ర వారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేర ళంలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, తెలం గాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే కేరళం ప్రజలు వచ్చి చూడాలని చెప్పడం పూర్తిగా అసత్య ప్రచారమన్నారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ఒక్క పథకం కూడా సమర్థవంతంగా అమలుకాలేదని, అమలుచేయని పథకాలను అమలుచేసినట్టు చెప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇది సాధారణ అబద్ధం కాదని, ప్రజలను మోసం చేసే ప్రయత్నమన్నారు.
మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? పెన్షన్లు రూ. 2,000 నుంచి రూ. 4,000 చేస్తామని, దివ్యాంగులకు రూ. 3,000 నుంచి రూ. 6,000 చేస్తామని చెప్పారు, అమలు చేశా రా? అంటూ నిలదీశారు. దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? బీసీలకు లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పారు..
రెండు సంవత్సరాల్లో ఒక్క ఏడాది కూడా రూ. 20,000 కోట్లు ఇవ్వలేకపోయారని, ఇవన్నీ కేరళం ప్రజలకు చెప్పగలరా? అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజ లకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకపోవడం ఒక మోసం అయితే, అమలు చేశామని చెప్పడం మరింత పెద్ద మోసమని, తప్పుడు ప్రచారం, అబద్ధాలు చెప్పడం ప్రజలకు దగా చేయడమే అన్నారు.
కాంగ్రెస్ మాటలను నమ్మొద్దు..
తెలంగాణలో పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం ఎక్కడ?, ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కడ?, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?, నిరుద్యోగ భృతి ఎక్కడ?.. ఈ హామీలన్నీ ఎక్కడికి పోయాయి? అని విమర్శించారు. కాంగ్రెస్ మాటలను నమ్మొద్దని, ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కేరళం ప్రజలనరు మోసం చేశాయని, గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిని అడ్డుకున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అవినీతి మరింత పెరుగుతుందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి మాటలకు కేరళంలో విలువ లేదని, ఆయన ఎందుకు అక్కడికి వెళ్లారో అందరికీ తెలుసని, తెలంగాణ నుంచి డబ్బులు పంపుతున్నారనే అనుమానాలు ప్రజలకు వస్తున్నాయని అన్నారు. డబ్బులు కోసం, ఉపన్యాసాలు ఇవ్వమని వారు పిలుస్తున్నారు కానీ ఓట్లు మాత్రం పడవని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డివి మోసం చేసే రాజకీయాలని, గతంలో కేసీఆర్ ఎలా హామీలు ఇచ్చి అమలు చేయలేదో, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా అదే మార్గంలో నడుస్తున్నారన్నారు.
కాంగ్రెస్ నిర్ణయంతోనే జరిగాయి..
2014కు ముందు బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో.. కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం ముంపు ప్రాంతాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందని పేర్కొన్న విషయాలు హరీశ్‌రావు మరిచిపోయారా? అని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలు కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే జరిగాయని, దీనికి బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ విషయంలో తాము పూర్తిస్థాయి దర్యాప్తు కోరుతున్నామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక మేడిగడ్డ లేదా కొన్ని పిల్లర్ల విషయంపై మాత్రమే మాట్లాడుతున్నారని, ప్రాజెక్టు మొత్తంగా సీబీఐ విచారణకు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉంది, పూర్తి నిజాలు బయటకు రావాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసిందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల కేసుల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ కుటుంబంపై కేసులు పెడతామని, జైలుకు పంపుతామని, లక్ష కోట్లు వసూలు చేస్తామని చెప్పారన్నారు.
కానీ ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా చర్యలు తీసుకోలేదన్నారు. మరి ఆ ఆరోపణలు ఏమయ్యాయి? దర్యాప్తు ఎక్కడికి పోయింది? ఇప్పుడు తమ అసమర్థతను దాచుకోవడానికి బీజేపీపై నెపం వేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన పార్టీగా బాధ్యత కాంగ్రెస్‌దేనని, వేరే వాళ్లపై నెట్టడం సరైంది కాదని, తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. అమలు చేయాల్సిన ప్రజాస్వామ్య బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.
తెలంగాణలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ వాలిపోతూ.. అక్కడి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ మహారాష్ట్ర, బిహార్ ఎన్నికల్లో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టారని కిషన్‌రెడ్డి చెప్పారు.




