సీఎం విమానాన్నీ తనిఖీ చేయాలి
ఢిల్లీకి కప్పం చెల్లించేందుకే ప్రత్యేక విమానం
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి) : రాష్ట్రంలో దోచుకున్న కప్పాన్ని ఢిల్లీకి ముట్టజెప్పేందుకే సీఎం రేవంత్ రెడ్డి తరచూ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నాడని, దేశవ్యాప్తంగా దశలవారీగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల కోసం ఆయన ఈ విమానాలను వినియోగించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తరచూ వెళ్లే ఈ విమానాలను ఎన్నికల కమిషన్ తనిఖీ చేయాలని సోమవారం ఓ ప్రెస్ మీట్‌లో ఆయన ఈ మేరకు డిమాండ్ చేశారు. పౌరసరఫరాల శాఖలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ హయాంలో జరిగినట్లే కాంగ్రెస్ హయాంలోనూ అవినీతి కొనసాగుతోందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వ్యవహారం మొదటి నుంచి హైడ్ అండ్ సీక్ గేమ్‌లా ఉందని, హిట్ అండ్ రన్ ఆటలా నడుస్తోందని విమర్శించారు. నాకు నువ్వు... నీకు నేను అన్నట్లుగా రెండు పార్టీలు కలిసే వ్యవహారాలు నడిపిస్తున్నాయన్నారు. సాగునీటి సమస్య, పౌరసరఫరాల అక్రమాలు రెండూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన శాఖలేనని అన్నారు. మంత్రివర్గంలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేదని, అంతా పర్సనల్ ఎజెండాతో నడుస్తోందని అన్నారు. సీఎం వ్యవహారం కామ్ కే వాస్తే కాదని, నామ్ కే వాస్తే మాత్రమేనని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సమీక్షకు మంత్రులే హాజరు కావడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి జోక్యమే లేద న్నారు. రాష్ట్రంలో కుంభకోణాలపై సీఎం రేవంత్ స్పందించాలని డిమాండ్ చేశారు.






