సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలా?
ఉత్తమ్‌కు పీసీసీ ఎలా వచ్చిందో తెలుసు
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో చోటుచేసుకున్న అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగడం సిగ్గుచేటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఆర్, బీ ట్యాక్స్‌పై సైలెంట్‌గా ఉండి యూ ట్యాక్స్ అనగానే స్పందించడం చూస్తే అవినీతి జరిగినట్టు స్పష్టమవుతోందన్నారు. ఇన్ని రోజులకైనా స్పందించినందుకు ధన్యవాదాలు చెబుతున్నానని ఎద్దేవా చేశారు. 19 ప్రశ్నలు అడిగితే కేవలం ఒకదానికే సమాధానం వచ్చిందని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ.. తాను పైరవీ చేసి ఎల్పీ పదవి తెచ్చుకున్నట్లు ఉత్తమ్ ఆరోపణలు చేశారని, బీజేపీలో పైరవీలకు చోటుండదని తెలిపారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా సీఎంగా అవకాశం ఇచ్చిన పార్టీ బీజేపీ అని గుర్తుచేశారు. పైరవీలు చేసి పదవులు తెచ్చుకునేందుకు తమది కాంగ్రెస్ కాదని ఎగతాళి చేశారు. తాను ఉత్తమ్‌తో కలిసి పదేళ్లు పనిచేశానని, ఆయన పీసీసీ ఎలా తెచ్చుకున్నారో తెలుసని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై తమ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అనుమతితోనే తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని తెలిపారు. దాన్ని కూడా అనుమానిస్తూ మాట్లాడితే అది మీ సీఎంను అవమానించడమే అవుతుందన్నారు.
రైస్ మిల్లర్లపై చర్యలేవీ?
రాష్ట్రంలో రూ.వేల కోట్ల బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఇంత వరకు ఉత్తమ్‌కుమార్ సమాధానమే ఇవ్వలేదని ఏలేటి ఆరోపించారు. 42 మందిపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. బకాయి ఉన్న రైస్ మిల్లర్ల లిస్టు ఎందుకు బయటపెట్టడం లేదని అడిగారు. ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువు మే 15నే ముగిసినా కాంట్రాక్టర్లకు మరో 4 నెలల అదనపు గడువు ఎందుకు ఇచ్చారని ఆయన మంత్రిని ప్రశ్నించారు. గడువు ముగిసినా ఒక్క ధాన్యం బస్తా కూడా ఎఫ్‌సీఐకి ఇవ్వలేదన్నారు. దీని వెనకున్న మతలబు ఏంటన్నారు. పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే అవినీతి ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్ విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు పక్కనబెట్టి మహేశ్వర్‌రెడ్డి సంధించిన 19 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.






