సీఎం మెడలు వంచుతా

28-04-2024 01:20:21 AM

ఆరు గ్యారెంటీలు అమలు చేయిస్తా

n నాలుగు నెలలకే నెర్రెలు బారిన పాలమూరు

n బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లు బిగిస్తరు

n ఆ పార్టీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టం

n ప్రవీణ్‌కుమార్ ఆశామాషీ పొలిటీషియన్ కాదు

n మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): పదేండ్లు పాడిపంటలతో అలరారిన తెలంగాణ, కాంగ్రెస్ పాలనలో నాలుగు నెలలకే అల్లాడుతున్నదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. పచ్చని పంటలతో తులతూగిన పాలమూరు జిల్లా నెర్రెలు బారుతున్నదని అన్నారు. అలవికాని హామీలు గుప్పించి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసలు రంగు నాలుగు నెలలకే బయటపడిందని అన్నారు. తెలంగాణకు బీజేపీ అక్కరకు రాని చుట్టమని పేర్కొన్నారు. బస్సు యాత్రలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం ఆయన ప్రసంగించారు. 14 ఏండ్లు వెన్నుచూపని పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తుచేశారు.

పాలమూరు ప్రజలు తనను ఎంపీగా గెలిపించినందుకు రుణపడి ఉన్నట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీన్‌కుమార్ ఆశామాషీ రాజకీయ నాయకుడు కాదని, ఒక విజన్ ఉన్న నాయకుడని చెప్పారు. పాడిపంటలతో పచ్చబడ్డ తెలంగాణలో రైతులంతా బిజీగా ఉండేవారని, కాంగ్రెస్ పాలనలో రైతులను మళ్లీ తెర్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మిషన్ భగీరథ, వరికి రూ.500 బోనస్‌ను బోగస్ చేశారని, 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. పదెకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇద్దరు పాలేర్లకు పంచాయితీ అయితే మద్యవర్తి సెటిల్ చేసినట్లు.. ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రజలకు మధ్య కొట్లాట జరుగుతోందని బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతిస్తే ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెడలు వంచుతానని అన్నారు. 

బీజేపీ అక్కరకు రాని చుట్టం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కేసీఆర్ విమర్శించారు. బీజేపీకి ఓటేస్తే మళ్లీ మోటర్లకు మీటర్లు పెడతారని హెచ్చరించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రచారానికి వచ్చినా బీజేపీ సభలో పట్టుమని 15 వందల మంది లేరని ఎద్దేవా చేశారు. ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ గెలుస్తుందని హెచ్చరించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం వంద ఉత్తరాలు రాసినా మోదీ సర్కారు స్పందించలేదని, బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టమని స్పష్టంచేశారు. పాలమూరులో బీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తున్నారని.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని తెలిపారు. కేసీఆర్ వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజేయుడు, నాగం జనార్దన్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.