సీఏఏకు కాంగ్రెస్సే అడ్డుకట్ట
l మతంతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తోంది
l అంబేడ్కర్‌ను సైతం అవమానించింది ఆ పార్టీయే
l బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఇస్లాం దేశాల్లోని మైనారిటీలైన హిందువులు, జైనులు, క్రైస్తవులు మత హింసకు గురవుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. వారంతా శరణార్థులుగా మన దేశానికి వస్తామని వేడుకుంటున్నారని, వారికి పౌరసత్వం ఇస్తామంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను మతంతో ముడిపెట్టి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందన్నారు. దేశమంతా కోరుకున్న అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఆ పార్టీ అడుగడుగునా అడ్డుకుందని ఆయన ధ్వజమెత్తారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రోజున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరుకాలేదని విమర్శించారు. రామున్ని అవమానించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో ఇంటరాక్టివ్ మీట్ విత్ మీడియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అంబేడ్కర్‌ను అనేకసార్లు అవమానించిందని లక్ష్మణ్ ఆరోపించారు. ఆయన చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టి భారతరత్నతో గౌరవించామని గుర్తుచేశారు. ఆ మహనీయుని త్యాగాలు, ఆశయాలను భావితరాలకు అందించేందుకు యత్నిస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. రూ.350 కోట్లతో అంబేడ్కర్ స్ఫూర్తి, దీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లే పీఓకే పాకిస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. సోమసాథ్ ఆలయ పునరుద్ధరణను ఆనాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు.






