30 June, 2026 | 1:42 AM

కోల్ యాస్ హ్యాండ్లింగ్ నిర్వహణను జెన్‌కో ఆధ్వర్యంలో కొనసాగించాలి

30-06-2026 12:00 AM

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాక్ డిమాండ్

పాల్వంచ, జూన్ 29 (విజయక్రాంతి): తెలంగాణ జెన్కో పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ,కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్  నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే ప్రతిపాదనను పునఃపరిశీలించి జెన్ కో ఆధ్వర్యంలోనే కొనసాగించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాక్ ఆధ్వర్యంలోని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

ఈ మేరకు సోమవారం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కాంప్లెక్స్లోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. గత వారం రోజుల నుండి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విషయం విధితమే. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని కీలక విభాగాల నిర్వహణ ప్రభుత్వ రంగంలోనే కొనసాగితే సంస్థకు, ఉద్యోగులకు, స్థానిక ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

దేశంలోనే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఒకటైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను పూర్తిగా జెన్ కో ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున కేటీపీఎస్ ఏడోదశ బ్రాంచ్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్, కేటీపీఎస్ 5, 6 దశల బ్రాంచ్ సెక్రటరీ బట్టు హరీష్, బి. రవి, రామకృష్ణ జాదవ్,  సమీర్ అహ్మద్, కృష్ణయ్య గారు తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున వంశీ, దూష సురేష్, రామ్ సింగ్ .తెలంగాణ డిప్లొమా ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున ఆర్.స్పందన ,నాగరాజు, ఎస్. భాను మహేష్, బాల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం తరఫున వెంకటేశ్వర్లు, తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ పాల్గొన్నారు.