30 June, 2026 | 1:38 AM

నత్తనడక..

30-06-2026 12:49 AM
  1. ముందుకు సాగని జడ్చర్లలో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణ పనులు
  2. నెలలు గడుస్తున్నా పూర్తి పై శ్రద్ధ ఏది..?
  3. విద్యాలయాలు ప్రారంభం కావడంతో తప్పని తిప్పలు
  4. పద్మావతి కాలనీ వాసుల కష్టాలు

జడ్చర్ల జూన్ 29 : మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో ఊర చెరువు అలుగునీరుతో పాటు డ్రైనేజీ నీరు వెళ్లేందుకు స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులను ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఎప్పుడూ పూర్తయితాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. పాఠశాలల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించినా ఆ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. అధికారుల అలసత్వం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తో పనులు మందకొడిగా సాగుతున్నాయి.

విద్యార్థుల ఇబ్బందులు..

డ్రైనేజీ ప్రధాన కాలువ ముఖ్యంగా పద్మావతి కాలనీ పరిధిలోని 23, 24వ వార్డులోని ప్రధాన రహదారిపై చేపట్టారు. అండర్ గ్రౌండ్ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ కాలువ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. కాలనీలో సుమారు 100 మందికి పైగా విద్యార్థులు వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు . నిత్యం పదుల సంఖ్యలో బస్సులు ప్రధాన రహదారిపై ప్రయాణం సాగిస్తుంటాయి.

అయితే ప్రధాన రహదారిపై అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడంతో కాలనీవాసులు కనీసం ఇండ్ల నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితి నెలకొన్నది. ఇటు కాంట్రాక్టర్ కానీ, అటు అధికారులు కానీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో  కాలనీవాసులు గత రెండు నెలలుగా నానా అవస్థలు పడుతున్నారు. గత వారం వరకు బాగానే ఉన్నా పాఠశాలలు ప్రారంభం కావడంతో చిన్నారులతోపాటు తల్లిదండ్రులు అటు కాలనీవాసుల ఇబ్బందులు వర్ణనాతీతం.

ఇంకా పనులు కూడా ఎప్పుడు పూర్తవుతాయో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. వర్షాలు ప్రారంభం కావడంతో మొరుగు కాలువ లో పూర్తిగా వర్షపు నీరు చేరి పనుల పూర్తికి మరింత ఆటంకం కలుగుతున్నది. ఎమర్జెన్సీ వర్క్ కింద పెట్టి పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉన్న ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో కాలనీవాసులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు.

మూడు స్కూల్స్..

పద్మావతి కాలనీ ప్రధాన రహదారిలో మూడు స్కూళ్ళు.. సుమారు 2500 మందికి పైగా విద్యార్థులు నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. ఇదే కాకుండా కాలనీవాసులు నిత్యం ప్రయాణాలు సాగిస్తుంటారు.. వర్షాకాలం ప్రారంభం కావడంతో పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి.

స్ట్రాంగ్ వాటర్ ప్రధాన కాలువలోకి వర్షపు నీరు చేరడంతో రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. వర్షాకాలానికి ముందే పనులు ప్రారంభించి వర్షాకాలం ప్రారంభం అయ్యే సరికి పూర్తి చేయాల్సి ఉన్న అటు అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ సైతం పట్టించుకోకపోవడంతో కాలనీవాసులకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు.