30 June, 2026 | 1:36 AM

కాలుష్య రహితంగా ఫ్యూచర్ సిటీ

30-06-2026 12:24 AM
  1.    30 వేల ఎకరాల్లో ఏర్పాటు
  2. జిల్లాల్లోనూ హైదరాబాద్ తరహా కనెక్టివిటీ
  3.    2047 నాటికి దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 10 శాతానికి రెట్టింపు 
  4. విధాన స్థిరత్వం, సులభతర వాణిజ్య నిర్వాహణే పెట్టుబడిదారులకు భరోసా
  5. మా ప్రభుత్వం నియంత్రణాధికారి కాదు.. సహాయకారి: మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నెట్-జీరో, కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేయనున్నామని, ఇందులో 200 ఎకరాల్లో ఏఐ సిటీ, గ్రీన్ ఫార్మా యూనిట్లు, అన్ని తరగతుల వారికి నివాస ప్రాంతాలు, దేశంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదటి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. తమ ప్రభుత్వం ‘నియంత్రణాధికారిగా కాకుండా సహాయకారిగా‘ వ్యవహరిస్తుందని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.

ఔటర్ రింగ్ రోడ్, రాబోయే రీజినల్ రింగ్ రోడ్, వరంగల్, ఆదిలాబాద్‌లలో నిర్మిస్తున్న కొత్త విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా జిల్లా కేంద్రాలకు హైదరాబాద్ స్థాయి కనెక్టివిటీని విస్తరించనున్నట్లు తెలిపారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్‌కు, భారత స్వాతంత్య్ర శతవార్షికోత్సవం జరిగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్‌కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. సోమవారం ఒక జాతీయ ఆంగ్ల పత్రిక వీడియో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

దేశ జీడీపీలో దాదాపు 5 శాతం వాటాను తెలంగాణ ప్రస్తుతం అందిస్తోందని, 2047 నాటికి ఈ వాటాను 10 శాతానికి రెట్టింపు చేయాలని భావిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ లక్ష్య సాధనకు పాలన, పరిశ్రమలు, అట్టడుగు స్థాయి ఆర్థిక కార్యకలాపాలలో నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడం కీలకమని పేర్కొన్నారు. ఇందులో రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా భాగమని, వీరికి ఈ ఏడాదే రూ.21 వేల కోట్ల రుణాలు అందించామని, ఎన్పీఏలు దాదాపు సున్నా స్థాయిలో ఉన్నాయని తెలిపారు.

పెట్టుబడిదారుల విశ్వాసానికి రెండు ప్రధాన అంశాలు కారణమని శ్రీధర్‌బాబు అన్నారు. రాజకీయ పార్టీలు మారినా కొనసాగుతున్న విధాన స్థిరత్వం, సులభతర వాణిజ్య నిర్వాహణ పెట్టుబడిదారులకు భరోసానిస్తున్నాయని చెప్పారు. టీఎస్ ఐపాస్ సింగిల్ విండో వ్యవస్థ ద్వారా అనుమతులు 21 రోజుల్లోనే మంజూరవుతున్నాయని, ఇప్పుడు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ ద్వారా సాంకేతికత సహాయంతో మరింత పారదర్శకత, పెండింగ్ అనుమతుల రియల్-టైమ్ ట్రాకింగ్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు.

1950--70వ దశకాలలో స్థాపించిన సంస్థల ఆధారంగా అభివృద్ధి చెందిన తెలంగాణ రక్షణ, ఏరోస్పేస్ రంగం ఇప్పుడు ఐటీ, ఫార్మా ఎగుమతులను మించిపోయిందని మంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల విషయంలో, వచ్చే ఐదేళ్ల కోసం రూ. 600 కోట్లు కేటాయించినట్లు, ప్రతి జిల్లాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. భూమి కొనుగోలు చేయకుండా లీజుకు తీసుకునే విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

ఇది కరోనా మహమ్మారి సమయంలో దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈలకు పెట్టుబడి సమస్యలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. కొత్త పార్క్ స్థలంలో నాలుగో వంతు మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నారు. అలాగే, ఆర్థిక సహాయం పొందడంలో, సాంకేతికతను (ఏఐతో సహా) అందుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఎంఎస్‌ఎంఈలకు సహాయం చేసేందుకు ‘ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్స్‘ను ప్రభుత్వం ప్రారంభించిదని తెలిపారు.

తమ ప్రభుత్వం ‘నియంత్రణాధికారిగా కాకుండా సహాయకారిగా‘ వ్యవహరిస్తుందని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. అత్యున్నత శ్రేణి మౌలిక సదుపాయాలు, డిజిటల్ సన్నద్ధత, విధాన స్థిరత్వాలు అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిలో తెలంగాణను విభిన్నంగా నిలబెడుతుందని ఆయన అన్నారు.